మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్

టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని కృష్ణాజిల్లా పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. గత వారం గన్నవరంలో నిర్వహించిన యువగళం బహిరంగ సభలో అయ్యన్న తీవ్ర విమర‌్శలు చేశారని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి పేర్ని నాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖపట్నం ఎయిర్‌ పోర్టులో అయ్యన్నపాత్రుడిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఢిల్లీ నుంచి విమానంలో విశాఖ వచ్చిన అయ్యన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు విశాఖ పోలీసులకు కృష్ణా జిల్లా పోలీసులు సమాచారం ఇచ్చారు. ఉదయం 9 గంటల తర్వాత అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందించారు. గన్నవరం యువగళం సభలో జిల్లా మంత్రులు, వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రిపై అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
దీనిపై పేర్ని నాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, అయ్యన్న పాత్రుడిపై కేసులు నమోదు చేశారు. గన్నవరం బహిరంగ సభలో అయ్యన్న చేసిన ప్రసంగాలపై టీడీపీ నేతలపై కేసులు నమోదైనట్లు పోలీసులు అయ్యన్నకు వివరించారు. ఆయన పోన్లను స్వాధీనం చేసుకున్నారు.
 
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అయ్యన్నపై 153 ఏ, 354 ఏ1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కృష్ణా జిల్లా పోలీసులు తెలిపారు. కాగా, అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తూ సీఎం జగన్ ఎంత కక్షతో రగిలిపోతున్నాడో అయ్యన్న పాత్రుడి అరెస్టే నిదర్శనమని టీడపీ ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు మండిపడ్డారు. 
 
జగన్ ప్రజాస్వామ్య మూలాలను ధ్వంసం చేస్తున్నాడని గన్నవరం సభలో అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించారు. ఇలా ఉండగా, విశాఖ ఎయిర్‌ పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్న టీడీపీ నాయకుడు అయ్యన్నను యలమంచిలి ప్రాంతంలో పోలీసులు విడిచిపెట్టారు. అయ్యన్నకు 41ఏ నోటీసులిచ్చి జాతీయ రహదారిపై విడిచి పెట్టారు.
అయ్యన్నపాత్రుడితో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్‌లో సంభాషించారు. సీనియర్ నేత అయ్యన్న పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును చంద్రబాబు తప్పుబట్టారు. అరెస్ట్, కేసులతో అయ్యన్న గొంతు నొక్కాలి అని చూస్తున్నారని మండిపడ్డారు. తాను దైర్యంగా ఉన్నానని.. జగన్‌ను, అసమర్థ ప్రభుత్వాన్ని వదిలేది లేదని అయ్యన్న చెప్పారు. పోలీసులు అరెస్టు చేసుకుంటారా చేసుకోండి.. కొడతారా కొట్టండి… చంపేస్తారా చంపేయండి రాష్ట్రం కోసం చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని అంటూ ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.