వెల్లడించని ఆదాయంపై చంద్రబాబుకు ఐటీ నోటీసులు

 
* రూ 118 కోట్ల ముడుపులు చెల్లింపుపై అనుమానాలు
 
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆదాయ పన్నుల శాఖ నోటీసులు జారీ చేసింది. 2020- 21 ఆర్ధిక సంవత్సరంలో వెల్లడించని ఆదాయంలో రూ.118 కోట్లకు లెక్కలు చెప్పాలని ఆదేశించింది. 2014-19 మధ్య కాలంలో ఏపీలో కాంట్రాక్టులు నిర్వహించిన మౌలిక సదుపాయాల కంపెనీల నుంచి చంద్రబాబునాయుడు రూ.118 కోట్ల రుపాయలు ముడుపులు అందుకున్నారని ఐటీ శాఖ అనుమానిస్తోంది. 
 
నాలుగేళ్లుగా సాగుతున్న దర్యాప్తుకు చంద్రబాబు ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని ఐటీ శాఖ ఆగస్టు 4న నోటీసులు జారీ చేసింది. కాంట్రాక్టు సంస్థల నుంచి మళ్లించిన ఆదాయాన్ని చంద్రబాబు “వెల్లడించని ఆదాయం”గా పరిగణిస్తూ ఐటీ శాఖ నోటీసుల్ని జారీ చేసింది.  చంద్రబాబు ఆదాయ వ్యవహారాలపై పరిశీలించిన సెంట్రల్‌ సర్కిల్ ప్రొసీడింగ్స్‌కు ఉపక్రమించినట్లు సెక్షన్ 153సి ప్రకారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.
ప్రాథమిక విచారణలో సబ్‌ కాంట్రాక్టుల కేటాయింపు ద్వారా మాజీ సిఎం చంద్రబాబుకు ఆదాయం సమకూరినట్లు ఐటీ శాఖ అనుమానిస్తోంది. సెక్షన్ 153సి ప్రకారం ఐటీ శాఖకు విస్తృత సోదాలు నిర్వహించేందుకు అవకాశాలు లభిస్తాయి. మనోజ్‌ వాసుదేవ్‌ పార్దసాని అలియాస్ ఎంవిపి అనే వ్యక్తి కార్యాలయాల్లో ఐటీ శాఖ జరిపిన సోదాల్లో ఈ వ్యవహారాలు వెలుగు చూశాయి.
2017 నుంచి షాపూర్‌జీ పల్లోంజి అండ్‌ కో సంస్థ తరపున ఎంవిపి అనే వ్యక్తి టెండర్ల ప్రక్రియలో పాల్గొంటున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. 2019లో జరిపిన సోదాల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఐటీ శాఖ విచారణలో మనోజ్ వాసుదేవ్ పార్ధసాని బోగస్‌ కాంట్రాక్టులు, వర్క్‌ ఆర్డర్‌లతో షపోర్‌ పల్లోంజి సంస్థ నిధులు మళ్ళించినట్టు అంగీకరించినట్టు ఐటీ శాఖ స్పష్టం చేసింది. నగదు లావాదేవీల కోసం సబ్‌ కాంట్రాక్టులను ఏర్పాటు చేసినట్లు ఎంవిపి ఒప్పుకున్నట్టు ఐటీ శాఖ పేర్కొంది.

ఈ వ్యవహారంలో నడిచిన పలు మెసేజీలు, చాటింగ్‌లు, ఎక్సెల్‌ షీట్లను ఎంవిపి కార్యాలయాల నుంచి ఐటీ శాఖ సోదాల్లో స్వాధీనం చేసుకుంది. పలు ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ కంపెనీల నుంచి నిధుల మళ్లింపుపై ఆధారాలను సేకరించినట్లు పేర్కొన్నారు. రకరకాల పద్ధతుల్లో సేకరించిన నగదును అక్రమ పద్ధతుల్లో చంద్రబాబు నాయుడుకు చేరినట్లు ఐటీ శాఖ అనుమానిస్తోంది.

ఎంవిపి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్‌కు 2016 నుంచి సంప్రదింపులు చేస్తున్నట్లు ఐటీ దర్యాప్తులో గుర్తించారు. తెలుగు దేశం పార్టీ కోసం నిధులు సమకూర్చాలని ఎంవిపిని కోరిన మెసేజీలను కూడా ఐటీ శాఖ గుర్తించింది. 2019 నవంబర్ 1 , 5 తేదీలలో నమోదు చేసిన స్టేట్‌మెంట్‌లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షపోర్‌జీ పల్లోంజీ సంస్థకు కేటాయించిన పనుల్లో నిధుల్ని మళ్లించినట్టు అంగీకరించాడు. 

షపోర్‌జి పల్లోంజి సంస్థతో పాటు ఎల్‌ అండ్‌ టి సంస్థ నుంచి సేకరించిన నిధుల్ని కూడా ఫినిక్స్ ఇన్‌ఫ్రా, పౌర్ ట్రేడింగ్ సంస్థల ద్వారా మళ్లించినట్లు గుర్తించినట్లు చంద్రబాబు నాయుడకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.  ఐటీ విచారణ సందర్భంగా ఎంవిపిని విచారించిన సమయంలో పక్కా ఆధారాలతో ప్రశ్నించడంతో లావాదేవీలు జరిగిన తీరును అతని పూర్తిగా బయటపెట్టాడు. 

మౌలిక సదుపాయాల కంపెనీల నుంచి నిధులు మళ్లింపు జరిగిన తీరును వివరించాడు. కాంట్రాక్టు సంస్థ నుంచి నిధులను తీసుకుని వాటిని పిఏ శ్రీనివాస్‌కు అందించినట్టు గుర్తించారు. ఈ క్రమంలో సబ్‌ కాంట్రాక్టుల కేటాయింపు పూర్తిగా బోగస్‌గా గుర్తించారు. బోగస్‌ వర్క్‌ ఆర్డర్లతో పనుల్ని కేటాయించినట్లు ఐటీ శాఖ గుర్తించింది. 

ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు నాయుడుకు అంతిమంగా లబ్ది కలిగినట్టు ఐటీ శాఖ భావిస్తోంది. సబ్ కాంట్రాక్టుల రూపంలో ఎంవిపి మళ్లించి చంద్రబాబు నాయుడుకు చెల్లించిన నగదు రూ.118,98,13,207ను 2020-21 సంవత్సరాల్లో వెల్లడించని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదని ఆగష్టు4న ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.