డ్రగ్స్ పార్టీలో కీలక నిందితుడు మాజీ నేవీ అధికారి

 
మాదాపూర్‌లోని ఫ్రెష్‌లింగ్ అపార్ట్‌మెంట్‌లో పోలీసులు భగ్నం చేసిన డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన కీలక నిందితుడు బాలాజీ మాజీ నేవీ అధికారి అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కొన్నేళ్ల క్రితం కన్నుకు గాయం కావడం వల్ల నేవీ నుంచి బాలాజీ వైదొలిగినట్లు తెలిపారు. తరచూ స్నేహితులతో హైదరాబాద్‌లో పార్టీలు నిర్వహించే బాలాజీ మాదాపూర్‌లోని ఫ్రెష్‌లింగ్ అపార్ట్‌మెంట్‌లో మిత్రులతో పార్టీలు చేసుకుంటున్నాడు. 
 
అయితే ఇదే క్రమంలో అతనికి హైదరాబాద్, బెంగళూరులోని మాదకద్రవ్యాల సరఫరాదారులతో పరిచయమేర్పడింది. వారి ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించిన నిందితుడు నైజీరియన్లతో సైతం సంబంధాలు కొనసాగించాడు. వారి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసిన బాలాజీ తెలిసిన, పరిచయం ఉన్న వారికి డ్రగ్స్ విక్రయించాడు.

ఈ క్రమంలోనే సులభంగా డబ్బు సంపాదించేందుకు సినీ పరిశ్రమలో ఉన్న కొందరికి విక్రయించడం షురూ చేశాడు. తరచూ బెంగళూరులో ఉంటున్న ముగ్గురు నైజీరియన్లు, విశాఖపట్నానికి చెందిన మరో వ్యక్తి నుంచి బాలాజీ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే క్రమంలో నిందితుడికి సినిమాలకు ఫైనాన్స్ చేసే వెంకటరత్నారెడ్డి పరిచయమయ్యాడు. 

అతను తరచూ విఐపిలకు నగర శివారు ప్రాంతాల్లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే తనకు భారీ మొత్తంలో డ్రగ్స్ కావాలని అతను బాలాజీకి భారీగా డబ్బు ముట్టజెప్పాడు. మరోవైపు వెంకటరత్నారెడ్డి తాను నిర్వహించే డ్రగ్స్ పార్టీలకు యువతులను సైతం సమకూరుస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఇతనికి డ్రగ్స్ పార్టీలు నిర్వహించే గుంటూరుకు చెందిన మురళితో పరిచయాలు ఉన్నాయి. మురళి ఆర్‌పిఎఫ్ ఐజీ వద్ద సీనియర్ స్టెనోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఈ డ్రగ్స్ దందాపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో గుడి మల్కాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో బాలాజీని వలపన్ని పట్టుకున్నారు. 

గుడి మల్కాపూర్ పోలీసులతో కలిసి సోదాలు చేసిన తెలంగాణా యాంటీ నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, 15 ఎక్స్‌ట్రాపిల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బాలాజీ సమాచారంతో మాదాపూర్‌లోని విఠల్‌రావునగర్‌లోని ఫ్రెష్‌లివింగ్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నంబర్ 804లో పోలీసులు సోదాలు నిర్వహించారు. 

అక్కడ వెంకటరత్నారెడ్డి సహా గుంటూరుకు చెందిన మురళిని అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసులో నలుగురు సరఫరాదారులు, వీరిలో నైజీరియన్లు, మరో 18 మంది వినియోగదారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వీరంతా పరారీలో ఉన్నారు.

అరెస్టయిన నిందితులు బాలాజీ, వెంకటరత్నారెడ్డి, మురళిల నుంచి టిన్యాబ్ పోలీసులు 2.8 గ్రాముల కొకైన్, 6 ఎల్‌ఎస్‌డి బోల్ట్, 25 ఎక్స్‌ట్రాపిల్స్, 40 గ్రాముల గంజాయి, రూ.72,500 నగదు, 2 కార్లు, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ రూ.32.89 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఈ రేవ్ పార్టీ, డ్రగ్స్ వ్యవహారంపై విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇది కేవలం రేవ్ పార్టీ మాత్రమే కాదు ఈ ముసుగులో వ్యభిచార దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సినిమా అవకాశాల పేరిట అమ్మాయిలను ఈ వ్యభిచార కూపంలోకి లాగుతున్నట్లు తెలుస్తోంది. నిందితుడు వెంకటరత్నారెడ్డి రేవ్ పార్టీ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

వెంకటరత్నారెడ్డి పాటు పట్టుబడిన బాలాజీ గతంలో వ్యభిచారం నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా ఈ ఇద్దరు వ్యభిచారం కేసులో రెండుసార్లు పట్టుబడ్డారని, అందుకు సంబంధించిన కేసులు వీరిపైన వున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కోణంలో విచారణ జరిపిన పోలీసులు తాజాగా ఇద్దరు అమ్మాయిలను కూడా వ్యభిచారం కోసమే తీసుకువచ్చినట్లు గుర్తించారు.

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి ఈ ఇద్దరు అమ్మాయిలను తీసుకువచ్చి గత రెండు రోజులుగా ఇదే అపార్ట్ మెంట్ లో వుంచినట్లు సమాచారం. ఈ అమ్మాయిలతో గడిపేందుకే మిగతావారు అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. గంజాయితో పాటు వివిధ రకాల డ్రగ్స్ తో సినీ రంగానికి చెందినవారితో పాటు ఇతర ప్రముఖులకు వెంకటరత్నారెడ్డి పార్టీలు ఏర్పాటు చేస్తున్నాడని బయటపడింది.