ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై మండిపడ్డ అదానీ

ఇద్దరు విదేశీ పెట్టుబడిదారుల ద్వారా అదానీ గ్రూప్ కంపెనీల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్‌పీ) నివేదిక పేర్కొనడంతో మరోసారి అదానీ కంపెనీలపై దుమారం చెలరేగింది. ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్ మండిపడింది.  జార్జ్ సొరోస్ నిధులతో నడుస్తున్న సంస్థలు పాత పాటనే మళ్లీ పాడుతున్నాయని దుయ్యబట్టింది. ఇవన్నీ రీసైకిల్డ్ ఆరోపణలని వ్యాఖ్యానించింది. తెర మరుగున ఉన్న మదుపరులు ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. విలువ లేని హిండెన్‌బర్గ్ నివేదికను పునరుద్ఘాటిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే, అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. మొత్తం 10 స్టాక్స్ 1 నుంచి 4 శాతం చొప్పున పడిపోగా.. గ్రూప్ మార్కెట్ విలువ ఒక్కరోజే సుమారు రూ.35 వేల కోట్ల మేర పతనమైంది. గత సెషన్‌లో అదానీ గ్రూప్ స్టాక్స్ మార్కెట్ విలువ రూ.10.84 లక్షల కోట్లుగా ఉండగా ఇప్పుడు అది రూ. 10.49 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే గురువారం సింగిల్ సెషన్‌లోనే రూ.35 వేల కోట్లకుపైగా పడిపోయింది.

పారదర్శకత లేని మారిషస్ నిధుల ద్వారా అదానీ గ్రూప్ బహిరంగంగా ట్రేడ్ అవుతున్న స్టాక్స్‌లోకి పెట్టుబడులను తీసుకొస్తోందని, అదానీ కుటుంబ సభ్యుల వ్యాపార భాగస్వాముల అస్పష్టమైన ప్రమేయం దీనిలో ఉందని ఆ నివేదిక ఆరోపించింది.

అయితే, అదానీ గ్రూప్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ ఆరోపణలను విస్పష్టంగా కొట్టిపారేసింది. ఈ రీసైకిల్డ్ ఆరోపణలను విస్పష్టంగా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. ఏమాత్రం విలువలేని హిండెన్‌బర్గ్ నివేదికను పునరుజ్జీవింపజేయడం కోసం ఓ వర్గం విదేశీ మీడియా మద్దతుతో, జార్జ్ సొరోస్ ఇచ్చే నిధులతో పని చేసే శక్తుల ద్వారా సమన్వయంతో జరుగుతున్న మరొక ప్రయత్నంగా ఈ నివేదికలు కనిపిస్తున్నాయని తెలిపింది.

ఓసీసీఆర్పీ నివేదికలో చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, ఓ దశాబ్దం క్రితం మూతపడిన కేసుల ఆధారంగా ఈ ఆరోపణలు చేసిందని చెప్పింది. ఓవర్-ఇన్‌వాయిసింగ్, విదేశాల్లో నిధుల బదిలీ, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ ద్వారా పెట్టుబడులపై వచ్చిన ఆరోపణలపై పదేళ్ల క్రితమే డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) దర్యాప్తు చేసినట్లు గుర్తు చేసింది.

లావాదేవీలన్నీ చట్టాలకు అనుగుణంగానే జరిగాయని, ఓవర్-వాల్యుయేషన్ జరగలేదని స్వతంత్ర యాడ్జుడికేటింగ్ అథారిటీ, అపిలేట్ ట్రైబ్యునల్ ధ్రువీకరించాయని తెలిపింది. 2023 మార్చిలో సుప్రీంకోర్టు తమకు (అదానీ గ్రూప్‌నకు) అనుకూలంగా తీర్పు చెప్పడంతో ఈ అంశానికి తుది రూపం వచ్చిందని తెలిపింది. ఓవర్-వాల్యుయేషన్ లేనందువల్ల నిధుల బదిలీపై ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని వివరించింది.

ఈ ఎఫ్‌పీఐలు ఇప్పటికే సెబీ దర్యాప్తులో పాలుపంచుకుంటున్నట్లు తెలిపింది. నిబంధనలకు అనుగుణంగా ఉండవలసిన మినిమమ్ పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (ఎంపిఎస్) లేదని కానీ, స్టాక్ ధరల మానిపులేషన్ జరిగినట్లు కానీ ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ స్పష్టం చేసిందని గుర్తు చేసింది.

గతంలో ఈ ఏడాది జనవరి 24న అమెరికాకు చెందిన సంస్థ హిండెన్‌బర్గ్ కూడా సంచలన రిపోర్ట్ వెలువరించింది. అప్పుడు ఇంకా పెద్ద మొత్తంలో మార్కెట్ విలువ కుదేలైంది. దాదాపు సగం పతనమయ్యాయి. స్టాక్స్ కూడా చాలా వరకు సగానికిపైగా నష్టపోయాయి. గ్రూప్ మార్కెట్ వాల్యూ లక్షల కోట్లు తగ్గింది. ఆ ఆరోపణలపై ప్రస్తుతం సెబీ విచారణ జరుగుతోంది. సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరోసారి హిండెన్‌బర్గ్ 2.O. మాదిరిగా  ఓసీసీఆర్‌పీ నివేదిక వెల్లడైన్నట్లు కనిపిస్తున్నది.