శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట

రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18 నుండి జరుగనున్నా నేప‌థ్యంలో భక్తులకు సంతృప్తికరంగా మూలమూర్తి దర్శనంతోపాటు వాహనసేవలు వీక్షించే అవకాశం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేపడుతున్నామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భ‌వ‌నంలో శుక్ర‌వారం నిర్వ‌హించిన డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.

* అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. పెరటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది కావున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తాం.

* సెప్టెంబర్‌ 18న ధ్వజారోహణం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

* ముఖ్యంగా సెప్టెంబరు 22న గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహిస్తాం.

* బ్రహ్మోత్సవాల కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకరణ సేవలు రద్దయ్యాయి. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవాటికెట్లు బుక్‌ చేసుకున్న గృహస్తులను వారికి సూచించిన వాహనసేవలకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది.

* బ్రహ్మోత్సవాలలో అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడమైనది.

* బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున 2024 సంవత్సరపు టీటీడీ క్యాలండర్లు, డైరీలను ముఖ్యమంత్రి వర్యులచే విడుదల చేస్తాం.

* హిందూ సనాతన ధర్మప్రచారంలో భాగంగా రాష్ట్రంలో టీటీడీ ఆర్థిక సహాయంతో నిర్మించిన 501 ఆలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం ఆగస్టు నెలకు ఒక్కో ఆలయానికి రూ.5 వేలు చొప్పున 25 లక్షలా 5 వేల రూపాయలను శ్రీవాణి ట్రస్ట్‌ నిధుల ద్వారా విడుదల చేశాం.

* రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఆగస్టు 22 నుండి 26వ తేదీ వరకు కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమాలు నిర్వహించాం. తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో వ‌ర్షాలు కురుస్తున్నాయి.
 
* ఈ నెల 4 నుండి 6వ తేదీ వరకు తిరుపతిలోని అలిపిరి వ‌ద్ద గ‌ల‌ శ్రీ వేంకటేశ్వర శిల్ప కళాశాలలో శిల్పాల తయారీ, ఆలయ నిర్మాణంపై వర్క్‌షాప్‌ జరుగనుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి నిపుణులు విచ్చేసి మెళకువలను తెలియజేస్తారు.