విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్‌-1

సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూపొందించిన ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ సి57 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. 
 
ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం ప్రయోగం విజయవంతం అయినట్టుగా ఇస్రో ప్రకటించింది.  పీఎస్ఎల్వీ సీ 57 రాకెట్ నుంచి విడివడిన ఆదిత్య ఎల్ 1 ఇక స్వతంత్రంగా సూర్యుడి దిశగా తన ప్రయాణాన్ని కొనసాగించనుంది. ఆదిత్య ఎల్ 1 ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. దాదాపు 125 రోజుల పాటు అంతరిక్షంలో సూర్యుడి దిశగా ప్రయాణం సాగించి, భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్ 1 కక్ష్యలోకి చేరుతుంది.
 
అక్కడి నుంచి సూర్యుడి వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. సూర్యుడి కి సంబంధించిన ఫొటోలను భూమికి పంపిస్తుంది. ఆదిత్య ఎల్ 1 లోని వివిధ పే లోడ్స్ సూర్యుడికి సంబంధించిన పలు అంశాలపై అధ్యయనం చేస్తాయి. ఐదేళ్ల పాటు ఈ పరిశోధనలను కొనసాగించనుంది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ డేటాను అందించనుంది. 
 
రోజుకు 1400 ఫోటోలను భూమికి పంపనుంది.  పిఎస్ఎల్వీ నుంచి ఉపగ్ర‌హం వేరై నిర్ణీత క‌క్ష‌లోకి ప్రేవేశించ‌డంతో షార్‌లో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఆదిత్య ఎల్1 ప్రయోగం విజయవంతమైందని తెలిపారు.  పీఎస్ఎల్వీ సీ 57 రాకెట్ ఆదిత్య ఎల్ 1ను విజయవంతంగా నిర్ధారిత కక్ష్యలో ప్రవేశపెట్టిందని సహచరుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
ఆదిత్య ఎల్1 కోసం పనిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు చెప్పారు. ఆదిత్య ఎల్ 1 దాదాపు 125 రోజులు సుదీర్ఘంగా ప్రయాణించి, ఎల్ 1 పాయింట్‌ను చేరుకుంటుందని.. ఆదిత్య ఎల్‌1కు ఆల్ ది బెస్ట్ చెప్పాలని అన్నారు. ఈ క్రమంలోనే అమెరికా, జపాన్, యూరప్, చైనా దేశాల తర్వాత సూర్యుడిపైకి ఉపగ్రహాన్ని పంపిన ఐదో దేశంగా భారత్ నిలిచింది. ఇక, కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
 
సూర్యుడి వాతావరణం, సూర్యుడి ఉష్ణోగ్రతల్లో చోటు చేసుకునే మార్పులు, వాటికి కారణం, సౌర తుపాన్లు, సూర్యుడి వాతావరణంలోని ప్లాస్మాపై అధ్యయనం, సూర్యుడిలో నుంచి తరచూ ఎగసిపడే కొరోనా మాస్ ఎజెక్షన్స్ కు కారణాలు.. మొదలైన వాటిని ఆదిత్య ఎల్ 1 అధ్యయనం చేస్తుంది. భూమిపై నుంచి పరిశీలించడానికి వీలు కాని, సాధ్యం కాని విషయాలను ఆదిత్య ఎల్ 1 పరిశీలిస్తుంది.
 
 మరోవైపు, ఎల్ 1 కక్ష్యలో భూమి గురుత్వాకర్షణ శక్తి, మరియు సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి దాదాపు సమానంగా ఉంటాయి. అందువల్ల అక్కడ ఆదిత్య ఎల్ 1 శాటిలైట్ స్థిరంగా ఉండి పరిశోధనలు చేయడానికి వీలు అవుతుంది. ఆదిత్య ఎల్ 1 బరువు 1,480.7 కిలోలు. ఇది సూర్యుడిపైకి ఇస్రో పంపించే తొలి ప్రయోగం కావడం విశేషం. దీంతో పాటు భూమి నుంచి చాలా దూరంలోకి కూడా ఇస్రో పంపించిన ప్రయోగంగా ఆదిత్య ఎల్ 1 రికార్డులలోకి ఎక్కింది.