టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా ఆర్బీఐ గవర్నర్

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారత్ లో ఆర్థిక వ్యవహారాల నియంత్రణకు మూలంగా భావించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ పనితీరుకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. తాజాగా అమెరికా- ఆధారిత గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా ర్యాంక్ పొందారు. 
 
శక్తికాంత దాస్ తర్వాత స్విట్జర్లాండ్ గవర్నర్ థామస్ జె జోర్డాన్, వియత్నాం సెంట్రల్ బ్యాంక్ చీఫ్ న్గుయెన్ థి హాంగ్ ఈ వరుసలో నిలిచారు. ఈ ఘనత సాధించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇది భారత దేశానికి గర్వకారణమైన అంశంగా పేర్కొన్నారు.
 
గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2023లో గవర్నర్ శక్తికాంత దాస్ ‘ఎ+’ రేటింగ్ పొందారు. ఎ+ రేటింగ్ పొందిన ముగ్గురు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌ల జాబితాలో దాస్ అగ్రస్థానంలో నిలిచారు. ఇది బ్యాంకింగ్ వ్యవస్థను సమర్థవంతంగా ఆయన నిర్వహిస్తున్న తీరుకు, అత్యుత్తమ పనితీరుకు అద్దం పడుతోంది. 
 
ద్రవ్యోల్బణం నియంత్రణ, ఆర్థిక వృద్ధి లక్ష్యాలు, కరెన్సీ స్థిరత్వం, వడ్డీ రేటు నిర్వహణలో విజయం కోసం గ్రేడ్‌లు ఎ నుంచి ఎఫ్ వరకు స్కేల్‌పై రేటింగ్స్ అందించినట్లు గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ వెల్లడించింది. ‘ఎ’ గ్రేడ్ పొందిన సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌లలో బ్రెజిల్‌కు చెందిన రాబర్టో కాంపోస్ నెటో, ఇజ్రాయెల్‌కు చెందిన అమీర్ యారోన్, మారిషస్‌కు చెందిన హర్వేష్ కుమార్ సీగోలం, న్యూజిలాండ్‌కు చెందిన అడ్రియన్ ఓర్ ఉన్నారు. 
 
అలాగే కొలంబియాకు చెందిన లియోనార్డో విల్లార్, డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన హెక్టర్ వాల్డెజ్ అల్బిజు, ఐస్‌లాండ్‌కు చెందిన అస్గీర్ జాన్సన్, ఇండోనేషియాకు చెందిన పెర్రీ వార్జియో ‘ఎ-‘ గ్రేడ్ పొందిన గవర్నర్‌లుగా నిలిచారు. 1994 నుంచి ప్రతి ఏటా గ్లోబల్ ఫైనాన్స్ తన రిపోర్టు కార్డును ప్రకటిస్తూనే ఉంది.