రెండు రుణ యాప్ లపై హెచ్చరించిన కేంద్రం

* విండ్‌మిల్‌ మనీ, ర్యాపిడ్‌ రూపీ ప్రో యాప్ లపై జాగ్రత్త
 
భారత్‌లో గత రెండేళ్లలో ఆన్‌లైన్‌ రుణ మార్కెట్‌ వేగంగా అభివృద్ధి చెందింది. అదే సమయంలో ఆన్‌లైన్‌ మోసాలు సైతం గణనీయంగా పెరిగాయి. రుణ యాప్‌ల వేధింపుల కారణంగా ఎంతో మంది జీవితాలను చాలించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి లేకుండా లావాదేవీలు జరుపుతున్నాయి. సిబిల్‌ స్కోర్‌, ఇతర పత్రాలు ఏవీ లేకుండా రుణాలు ఇస్తూ ఆ తర్వాత రుణగ్రహీతలను బ్లాక్‌ చేయిస్తున్నాయి.
ఇప్పటికే వేధింపులకు గురి చేస్తున్న 50కి పైగా లోన్‌ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే, ప్రతి రోజూ కొత్త కొత్త రుణ యాప్‌లు పుట్టుకువస్తున్నాయి.  ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రెండు కొత్త రుణ యాప్‌లకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న సైబర్‌డోస్ట్ అనే సైట్ ఈ రెండు యాప్‌లలో రుణం తీసుకునే ముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలని ట్విట్టర్‌ ద్వారా సూచించింది.
 
పలు యాప్‌లు దేశాలకు చెందిన సంస్థలను నిర్వహిస్తున్నాయని, ఎవరైనా సైబర్‌ నేరాల బారినపడితే బాధితులు 1930 డయల్‌ చేయాలని లేదంటే.. cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించింది. ప్రభుత్వం హెచ్చరించిన రుణ యాప్‌లలో విండ్‌మిల్‌ మనీ, ర్యాపిడ్‌ రూపీ ప్రో ఉన్నాయి. 
 
ఈ రెండు యాప్‌లు దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని ఓ వినియోగదారుడు ట్విట్టర్‌లో స్క్రీన్‌ షాట్లను షేర్‌ చేస్తూ ఫిర్యాదు చేశాడు. విండ్‌మిల్‌ యాప్‌ ప్రస్తుతం గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉండగా.. ర్యాపిడ్‌ రూపీ ప్రో యాప్‌ను తొలగించారు. యాప్‌లో రివ్యూలన్నీ మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంటున్నాయి. 
 
పే స్టోర్‌లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు విండ్‌మిల్‌ మనీ యాప్‌ను ఎస్టిసిఐ ప్రైమరీ డీలర్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. అయితే ఎస్టీసిఐ సైట్‌లో ఈ యాప్‌ను కంపెనీ అభివృద్ధి చేయలేదని, తమకు సంబంధం లేదని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా యాప్‌లో రుణాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు.