జెట్‌ ఎయిర్‌వేస్‌ నరేశ్‌ గోయల్‌ అరెస్ట్

కెనరా బ్యాంకును మోసంచేసిన కేసులో జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు ముంబైలోని ఈడీ ఆఫీస్‌లో ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు అనంతరం అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరుచనున్నారు.

కేనరా బ్యాంకును రూ.538 కోట్ల మేర మోసం చేసినట్లు సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నారు. మే 5న ముంబైలోని  ఏడు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని పేర్కొంటూ నరేశ్ గోయల్, అనితా గోయల్, గౌరంగ్ ఆనంద శెట్టి తదితరులపై గతేడాది నవంబర్ 11న సీబీఐకి కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ పీ సంతోష్ ఫిర్యాదు చేశారు. 

దీనివల్ల బ్యాంకుకు రూ.538.62 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు.  2019 మే 25న విదేశాలకు బయలుదేరి వెళ్లేందుకు నరేష్ గోయల్, ఆయన అనితా గోయల్ ప్రయత్నించారు. ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కడానికి అనుమతి నిరాకరించారు. నరేశ్ గోయల్ దంపతులు నాలుగు భారీ సైజ్ సూట్ కేసులతో విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం కావడం గమనార్హం.

విదేశీ విమాన సర్వీసుల సంస్థ ‘ఎతిహాద్’కు వాటాల విక్రయ ఒప్పందం విషయంలో విదేశీ మారక ద్రవ్యం యాజమాన్య సంస్థ (ఫెమా) నిబంధనలను నరేష్ గోయల్ ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో ముంబై, ఢిల్లీల్లోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై 2019 సెప్టెంబర్ లో తనిఖీలు చేశారు. 2020లో నరేశ్ గోయల్‌ని ఈడీ అధికారులు పలు దఫాలు ప్రశ్నించారు.

దాదాపు 25 ఏండ్ల పాటు నిరంతరాయంగా విమాన సేవలు నిర్వహించిన జెట్ ఎయిర్‌వేస్ భారీ నష్టాలతో సర్వీసుల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో విఫలం కావడంతో 2019 ఏప్రిల్‌లో మూత పడింది. తర్వాత బ్యాంకులు నిర్వహించిన వేలంలో జలాన్ కల్రాక్ కన్సార్టియం జెట్ ఎయిర్వేస్ సంస్థ బిడ్ సొంతం చేసుకున్నది. ఇంకా జలాన్ కల్ రాక్ కన్సార్టియం ఆధ్వర్యంలో జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు ప్రారంభం కావాల్సి ఉంది.