‘మోదీ @ ది టెర్మినేటర్.. 2024లో మళ్లీ నేనే’

దేశంలో మరో 9 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా ముచ్చగా మూడోసారి అధికారం చేపట్టాలనే కృతనిశ్చయంతో బీజేపీ పావులు కదుపుతోంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని సాగనంపడమే లక్ష్యంగా కాంగ్రెస్ సహా 26 విపక్ష పార్టీలు ‘ఇండియా’ పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. ముంబయి వేదికంగా ఆగస్టు 31, సెప్టెంబరు 1న ఇండియా కూటమి మూడో సమావేశం జరగనుంది. 
 
ఈ నేపథ్యంలో బిజెపి వినూత్న ప్రచారం చేపట్టింది. ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ స్క్యార్జెనేగర్ నటించిన ‘టెర్మినేటర్’ సినిమాను అనుకరిస్తూ
ప్రధాని మోదీ ఫోటోతో ఆ సినిమా క్యాప్షన్‌ జోడిస్తూ .. ది టెర్మినేటర్‘‘2024లో నేనే తిరిగి వస్తాను!’’ అంటూ పోస్టర్‌ను క్రియేట్ చేసి ట్విట్టర్‌లో బీజేపీ షేర్ చేసింది.
 
 ‘ఇండియా’ కూటమికి వ్యతిరేకంగా 2024 ఎన్నికల్లో గెలిచి నరేంద్ర మోదీయే తిరిగి మళ్లీ ప్రధాని అవుతారని బిజెపి ప్రచారం ఉధృతం కావిస్తున్నది. ‘‘ప్రతిపక్షాలు ప్రధాని మోదీని ఓడించొచ్చని భావిస్తున్నాయి.. కలలు కనండి! టెర్మినేటర్ ఎల్లప్పుడూ గెలుస్తాడు” అంటూ బీజేపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఈ పోస్టర్‌ను షేర్ చేస్తున్నారు.
 
మరోవైపు, ముంబయి వేదికగా జరిగే మూడో సమావేశంలో మరిన్ని పార్టీలు తమతో చేరుతాయని ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన నేతలు చెబుతున్నారు. గురువారం నాటి సమావేశంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు జెండా, ఎజెండా ఖరారవుతుందని సమాచారం. అదేవిధంగా తమ లోగోను కూడా ఖరారు చేయనున్నారు. 28 పార్టీలకు చెందిన 63 మంది ప్రతినిధులు ఈ సమావేశంకు హాజరవుతున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు.
 
కాగా, ఇదే సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కూడా ముంబయి వేదికగా బలప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఇటీవలే ఎన్డీయేలో చేరిన ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)ని స్వాగతించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 
 
అంతేకాదు, మహారాష్ట్రలోని మొత్తం 48 లోక్‌సభ సీట్లపై రెండు రోజుల పాటు సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్టు ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని ఎన్డీఏ సర్కారు ప్రకటించింది. ముంబయిలోని సీఎం షిండే అధికారిక నివాసంలో గురువారం తొలిసారిగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ లతోసహా ఇతర సీనియర్ నాయకులు హాజరవుతారు.
 
ఇలా ఉండగా, ముంబై భేటీకి వారం రోజుల ముందు నుండి `ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలు ప్రధాన మంత్రి అభ్యర్థి గురించి భిన్నమైన ప్రకటనలు ఇస్తుండటం శిబిరంలో కలకలం రేపుతోంది. కూటమి కన్వీనర్  ఎంపిక విషయంలో సహితం ఏకాభిప్రాయం కనిపించడం లేదు. `ఇండియా’ కూటమి ప్రధాన మంత్రి  అభ్యర్థి విషయంలో ఒక నిర్ణయానికి రాలేక పోవడంతో ప్రధాని మోదీకి గట్టి పోటీ ఇవ్వగలిగే స్థితిలో లేరంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా పేర్కొనడం గమనార్హం. 

 
రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా ప్రకటించే విషయమై భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఛత్తీస్ ఘర్ ముఖ్యమంత్రి సహితం అటువంటి ప్రకటన చేశారు. అదే సమయంలో బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల ప్రజలు ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్‌ను కోరుకుంటున్నారని బీహార్ మంత్రి, జెడి(యు) నేత శర్వణ్‌కుమార్ ప్రకటించడం కూడా నాయకత్వ అంశాన్ని వివాదాస్పదంగా మారుస్తుంది.
 
తాజాగా, ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా తాము ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ను కోరుకుంటున్నామ‌ని ఆప్ ప్ర‌తినిధి ప్రియాంక క‌క్క‌ర్ తెలిపారు. ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా తాను అర‌వింద్ కేజ్రీవాల్ వైపు మొగ్గుచూపుతాన‌ని, ఆప్ కన్వీన‌ర్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను మెరుగ్గా హైలైట్ చేస్తార‌ని, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి దీటైన స‌వాల్‌గా కేజ్రీవాల్ ఒక్క‌రే నెగ్గుకొస్తార‌ని పేర్కొన్నారు.