తొలిసారి విక్రం ల్యాండర్ ను ఫొటో తీసిన ప్రజ్ఞాన్ రోవర్

చంద్రయాన్ 3 ప్రయోగంలో చంద్రుడి ఉపరితలంపై తిరుగుతున్న ప్రజ్ఞాన్ రోవర్ తొలిసారి చంద్రుడి ఉపరితలంపై పార్క్ చేసి ఉన్న విక్రం ల్యాండర్ ను ఫొటో తీసింది. ఆ ఫొటోను ఇస్రో బుధవారం ట్విటర్ లో షేర్ చేసింది. చంద్రుడి ఉపరితలంపై తిరుగుతున్న ప్రజ్ఞాన్ రోవర్ అక్కడ నిలిచి ఉన్న విక్రం ల్యాండర్ ను వివిధ కోణాల్లో ఫోటో తీసింది. 
 
ఆ ఫోటోలలో విక్రమ్ ల్యాండర్ నిలిచి ఉన్న దృశ్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రజ్ఞాన్ రోవర్ లోని నావిగేషన్ కెమెరా ఈ ఫోటోలను తీసింది. బుధవారం ఉదయం 7:35 గంటలకు ఈ ఫోటోలను తీసినట్లు ఇస్రో వెల్లడించింది. ఆ ఫోటోలో విక్రమ్ ల్యాండర్ కు చెందిన రెండు పేలోడ్స్ పేఛేస్ట్, ఐఎల్ఎస్ఏ లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
 
ఎగుడు దిగుడుగా ఉన్న చంద్రుడి ఉపరితలం, పేలోడ్స్ ఈ రెండు ఫొటోల్లోనూ స్పష్టంగా కనిపిస్తోన్నాయి. ఈ రెండు పేలోడ్స్‌లల్లో ఒకటి- ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ. చంద్రుడిపై ప్రకంపనలను గుర్తించడానికి దీన్ని పేలోడ్‌గా పంపించింది ఇస్రో. చంద్రుడిపై ఉల్కాపాతం సంభవించినా దాన్ని ముందుగానే పసిగట్టగలుగుతుంది. 
 
గతంలో చంద్రుడిని ఢీ కొట్టిన ఉల్కాపాతాల డేటానూ ఇది సంగ్రహించగలుగుతుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై పార్క్ అయి ఉన్న విక్రమ్ ల్యాండర్ ఫోటోను ఇస్రో షేర్ చేయడం ఇదే మొదటిసారి. గత వారం ల్యాండర్ నుండి చంద్రుడి ఉపరితలంపైకి దిగుతున్న ప్రజ్ఞాన్ రోవర్ ఫోటోలను, వీడియోను ఇస్రో షేర్ చేసింది.
 
 ఆ తరువాత చంద్రుడి ఉపరితలంపై తిరుగుతున్న ప్రజ్ఞాన్ రోవర్ ఫోటోలను, వీడియోను షేర్ చేసింది కానీ చంద్రుడి ఉపరితలంపై నిలిచి ఉన్న విక్రం ల్యాండర్ ఫోటోను మాత్రం బుధవారం తొలిసారిగా ఇస్రో షేర్ చేసింది. ఆరు చక్రాల ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడు ఉపరితలంపై గత వారం రోజులుగా విక్రం ల్యాండర్ కు సమీపంలోనే తిరుగుతూ చంద్రుడి ఉపరితలాన్ని, వాతావరణాన్ని విశ్లేషిస్తుంది.