చైనా మ్యాప్ పై మండిపడ్డ భారత్

 
*చైనాను నమ్మవద్దన్న టిబెట్ ప్రవాస ఎంపీలు
 
అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చైనాలను తమ భూభాగంగా పేర్కొంటూ చైనా విడుదల చేసిన 2023 ఎడిషన్ “ప్రామాణిక మ్యాప్”పై భారతదేశం మండిపడుతూ తీవ్ర నిరసనను నమోదు చేసింది. “మ్యాప్” కూడా విడిపోయిన తైవాన్ ద్వీపం, దక్షిణ చైనా సముద్రంలో ఎక్కువ భాగాన్ని తమవిగా అందులో చైనా  పొందుపరిచింది.
 
భారతదేశం దౌత్య మార్గాల ద్వారా “తీవ్ర నిరసన”ను నమోదు చేస్తూ ఇటువంటి చర్యలు కేవలం “సరిహద్దు వివాదాల పరిష్కారాన్ని క్లిష్టతరం చేస్తాయి” అని హెచ్చరించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ  దౌత్య మార్గాల ద్వారా బలమైన నిరసనను నమోదు చేసామని తెలిపారు.
 
చైనా విడుదల చేసిన 2023 ‘ప్రామాణిక మ్యాప్’ లో తన భూభాగాలుగా భారత దేశపు భూభాగాలను  సంబంధించిన వాదనలకు ఎటువంటి ఆధారం లేవని, వాటిని తాము  పూర్తిగా తిరస్కరిస్తున్నామని స్పష్టం చేశారు. చైనా ఇటువంటి చర్యలకు పాల్పడటం సరిహద్దు వివాదాల పరిష్కారాన్ని క్లిష్టతరం చేస్తాయని ఆయన తేల్చి చెప్పారు. 
 
టిబెటన్ పార్లమెంట్- ప్రవాస ఎంపీలు సహితం చైనా విస్తరణ విధానాన్ని వ్యతిరేకించారు. ఆ దేశాన్ని “ఎప్పటికీ విశ్వసించలేము” అని స్పష్టం చేశారు. చైనా ఎవరికీ మిత్రుడు కాదని ఎంపీ దావా త్సెరింగ్ మండిపడ్డారు.  “మీతో స్నేహం కావాలని చైనా ఎప్పుడూ చెబుతుంది, కానీ దాని మధురమైన మాటల వెనుక చైనా దురుద్దేశం దాగి ఉంది. చైనా, దాని నాయకులను ఎప్పుడూ విశ్వసించవద్దు, ఎందుకంటే వారు ఎప్పటికీ ఎవరికీ స్నేహితులు కాలేరు” అని త్సెరింగ్ విమర్శించారు.
 
“చైనీస్ విస్తరణ విధానానికి వ్యతిరేకంగా దక్షిణాసియా దేశాలన్నీ నిలబడాలి. దీనిని ఖండించాలి” అంటూ  ప్రవాసంలో ఉన్న మరో టిబెటన్ ఎంపీ యెషి డోల్మా కూడా చైనా చర్యను రెచ్చగొట్టే చర్యగా అభివర్ణిస్తూ పిలుపిచ్చారు.  వచ్చే నెలలో జరగనున్న జీ20 సదస్సులో భారత్‌ను రెచ్చగొట్టాలని చైనా భావిస్తోందని ఆమె పేర్కొన్నారు. 1959లో చైనా అక్రమంగా టిబెట్‌పై దాడి చేసిందని, ఇప్పుడు పొరుగు దేశమైన భారత్‌ సరిహద్దును ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని డోల్మా వెల్లడించారు.
 
భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా చైనా విడుదల చేసిన “ప్రామాణిక మ్యాప్” ను తిరస్కరించారు. బీజింగ్ తమది కాని భూభాగాలను క్లెయిమ్ చేస్తూ గతంలో కూడా ఇటువంటి మ్యాప్‌లను ఉంచిందని, ఇది చైనా యొక్క “పాత అలవాటు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. “చైనా గతంలో కూడా చైనాకు చెందని భూభాగాలు, ఇతర దేశాలకు చెందినవిగా పేర్కొంటూ మ్యాప్‌లను బయటపెట్టింది. ఇది వారి పాత అలవాటు” అని జైశంకర్ పేర్కొన్నారు. ఎన్డీటీవీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ‘మ్యాప్’పై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
“ఇది కొత్తది కాదు. ఇది 1950 లలో ప్రారంభమైంది. కాబట్టి భారతదేశంలోని కొన్ని భూభాగాలను క్లెయిమ్ చేస్తూ మ్యాప్‌ను ఉంచడం ద్వారా.. ఇది మారదని నేను భావిస్తున్నాను (ఏదైనా). ఇవి చాలా భాగం భారతదేశంకు చెందినవే” అని ఆయన తేల్చి చెప్పారు.
 
“మా భూభాగాలు ఏమిటో మాకు చాలా స్పష్టత ఉంది. మా భూభాగాన్ని రక్షించుకోవడానికి ఏమి చేయాలో అనే విషయంలో కూడా మా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. దాని గురించి ఎటువంటి సందేహం ఉండకూడదని నేను భావిస్తున్నాను” అని జైశంకర్ హెచ్చరించారు. “కేవలం అసంబద్ధమైన వాదనలు చేయడం వల్ల ఇతరుల భూభాగాలు మీవి కావు. దాని గురించి చాలా స్పష్టంగా చెప్పండి,” అని పేర్కొన్నారు.