మాధాపూర్‌లో డ్రగ్స్‌ పార్టీలో సినీ నిర్మాత వెంకట్ అరెస్ట్

హైదరాబాద్ దేశంలోనే మాదక ధ్రావ్యాల సరఫరాకు, వినియోగానికి కేంద్రంగా ఉంటూ వస్తోంది. నగరంలో సినీ, రాజకీయ, ఐటి రంగాలకు చెందిన ప్రముఖులు అనేకమంది నిత్యం డ్రగ్స్ సేవిస్తున్న, డ్రగ్స్ సరఫరాలో పాల్గొంటున్నా, చివరకు పాఠశాల విద్యార్థులకు సహితం డ్రగ్స్ సరఫరా చేస్తున్నా పట్టి పట్టనట్లు ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తున్నది.  
 
గతంలో పట్టుబడిన బడా వ్యక్తులను వదిలి వేయడంతోనే ఇటువంటి పరిస్థితి నెలకొంది.  హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోవడంతో నిరంతర నిఘా ఉంచినా ఏదో ఒక ప్రాంతంలో వాటి ఉనికి బయటపడుతూనే ఉంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ఏదొక రూపంలో డ్రగ్స్‌ రవాణా జరుగుతోంది. 
 
తాజాగా, మాదాపూర్‌, విఠల్‌రావునగర్, వైష్ణవి అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న స్టేట్ నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి పార్టీ ని భగ్నం చేసారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఢమరుకం, పూల రంగుడు, లౌవ్లీ, ఆటో నగర్ సూర్య తదితర సినిమాలకు ఫైనాన్సియర్‌గా పనిచేసిన వెంకట్ ఆధ్వర్యంలో ఈ రేవ్ పార్టీ జరిగినట్లు తేలింది.
గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి గత కొద్దీ నెలలుగా పార్టీలు నిర్వహిస్తున్నాడు. వెంకట్ కదిలికలపై గత మూడు నెలలుగా నార్కోటిక్ బ్యూరో పోలీసులు నిఘా పెట్టారు. 
ఈ దాడిలో ఓ సినీ నిర్మాతతోపాటు పలువురిని అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు యువతులు ఉన్నట్లు సమాచారం. డ్రగ్స్ సేవిస్తూ దొరికిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పట్టుపడ్డ యువతి యువకులు వద్ద నుంచి కోకైన్, ఎల్ఎస్‌డీ డ్రగ్స్, గాంజాయితో పాటు రూ. 70 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో ఇద్దరు యువతులు ఢిల్లీకి చెందిన వారిగా గుర్తించారు. గతంలో కూడా పలువురు సినీనటులు మాదక ద్రవ్యాలను వినియోగించారనే ఆరోపణలు వచ్చినా నేరుగా వాటితో పట్టుబడిన సందర్బాలు లేవు. వెంకట్‌ ఫ్లాట్‌లో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న సమయంలో బాలాజీ, మధుబాల, వెంకటేశ్వర్ రెడ్డి, మురళీ, మెహక్‌లు ఉన్నట్లు గుర్తించారు.

బాలాజీపై గతంలో డ్రగ్స్‌ కేసులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.  వెంకట్‌ వాట్సాప్‌ చాట్‌ను పోలీసులు పరిశీలించారు. మూడు నెలలుగా వెంకట్‌ కదలికలపై నార్కోటిక్స్‌ బ్యూరో నిఘా ఉంచింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి డ్రగ్స్‌ పార్టీ ఏర్పాటు చేసినట్లు పక్కా సమాచారం అందడంతో నార్కోటిక్స్ బ్యూరో దాడి చేసింది. దాడిలో ఎల్‌ఎస్‌డితో పాటు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.