69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు అగ్రభాగం ఆక్రమించాయి. వాటిలో ఆస్కార్ గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్’ ఏకంగా 6 కేటగిరీల్లో జాతీయ అవార్డులు సాధించగా, ‘పుష్ప’ సినిమా రెండు విభాగాల్లో, ఉప్పెన, కొండపొలం సినిమాలు చెరొక కేటగిరీలో జాతీయ అవార్డులు సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని నలుదిశలా చాటాయి.
మొత్తం మీద టాలీవుడ్ నుంచే తెలుగు సినిమాలకు 10 జాతీయ అవార్డులు దక్కాయి. 68 ఏళ్లుగా తెలుగు సినిమాకు వెలితిగా మిగిలిన జాతీయ ఉత్తమ నటుడు అవార్డును తొలిసారిగా ‘పుష్ప’ సినిమాకు ‘అల్లు అర్జున్’ గెలుచుకున్నారు. ఉత్తమ నటుడి అవార్డు కోసం అల్లు అర్జున్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, సూర్య, ధనుష్, శింబు, ఆర్య, జోజు జార్జ్ పోటీపడ్డారు.
అల్లు అర్జున్ ‘తగ్గేదే లే’ అంటూ వీరందరినీ వెనక్కి నెట్టి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు హీరోగా నిలిచారు. తెలుగుతో పాటు దక్షిణాదికి చెందిన మళయాల, తమిళ, కన్నడ సినిమాలు సైతం వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులు సాధించాయి.
దక్షిణాది సినిమాలు ముఖ్యంగా తెలుగు, తమిళ సినిమాలు ‘ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా’గా మారాయని ప్రముఖ తమిళ దర్శకులు వసంత్ ఎస్. సాయి కొనియాడారు. 69వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన జ్యూరీ సభ్యుల్లో వసంత్ ఎస్ సాయి ఉన్నారు. నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆయన జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
అవార్డుల ప్రకటన అనంతరం మీడియాతో మాట్లాడిన వసంత్ ఎస్.ఎస్. రాజమౌళి, ఎం.ఎం. కీరవాణి భారతీయ సినిమా స్థాయిని ఆస్కార్ వరకు తీసుకెళ్లారని కొనియాడారు. అందుకే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అగ్రభాగాన నిలిచిందని తెలిపారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొందిన అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు పొందిన దేవీశ్రీ ప్రసాద్ సహా అందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు.
సినిమాలు అవార్డు పొందాలంటే అందులోని కథ అత్యంత కీలకమని ఆయన చెప్పారు. కంటెంట్ అనేది కింగ్ అన్నారు. ఆ కథను ఎంత అందంగా, సృజనాత్మకంగా చెప్పామన్నదాన్ని బట్టి జ్యూరీ సభ్యులు అవార్డుకు ఎంపిక చేయడానికి ఆస్కారం ఉంటుందని ఆయన తెలిపారు. సినిమా అనేది రేడియో, పుస్తకాల మాదిరి కాదని, విజువల్ మీడియా కాబట్టి క్రియేటివిటీ, విజువల్ టెక్నిక్స్ పాత్ర కూడా ఉంటుందని తెలిపారు.
తెలుగు సినిమాలకు వచ్చిన అవార్డులు
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)
ఉత్తమ తెలుగు చిత్రం – ఉప్పెన
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్(స్టంట్ కొరియోగ్రఫీ) – కింగ్ సాల్మన్ (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ కొరియోగ్రఫీ – ప్రేమ్ రక్షిత్ (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ – వి.శ్రీనివాస్ మోహన్ (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ లిరిక్స్- చంద్రబోస్ (ధమ్ ధమా ధమ్- కొండపొలం)
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్(సాంగ్స్) – దేవి శ్రీప్రసాద్ (పుష్ప – ది రైజ్)
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బ్యాగ్రౌండ్ స్కోర్) – ఎమ్‌ఎమ్ కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) – కాల భైరవ (కొమురం భీముడో.. – ఆర్‌ఆర్‌ఆర్)
బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ – ఆర్‌ఆర్‌ఆర్
బెస్ట్ తెలుగు ఫిలిం క్రిటిక్- పురుషోత్తమాచార్యులు
More Stories
దావోస్ నుండి వట్టిచేతులతో తిరిగి వచ్చిన చంద్రబాబు
ఇన్కాయిస్కు సుభాష్ చంద్ర బోస్ పురస్కారం
20 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం?