చంద్రయాన్ 3 తర్వాత సాంకేతికతతో సాటిలేని భారత్

చంద్రయాన్ 3 విజయంతో అంతరిక్ష సాంకేతికతలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందని చెబుతూ గతంలో మాదిరిగా ఇప్పుడు ఎవ్వరూ భారత్ కు  అణు, అంతరిక్ష రంగాల్లో సాంకేతికత అందించడానికి నిరాకరింపలేరని ఇస్రో మాజీ ఛైర్మన్ కె. కస్తూరిరంగన్ గుర్తు చేశారు. గతంలో ఇతర దేశాలు నిరాకరించడంతో, భారత్ సొంతంగానే ఈ రెండు కీలక రంగాలలో సాంకేతికతను అభివృద్ధి చేసుకొని, నేడు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని తెలిపారు.

తనకు ఇస్రో చైర్మన్ గా  ఉన్న సమయంలోనే చంద్రయాన్ సన్నాహాలు ప్రారంభం కావడాన్ని ప్రస్తావిస్తూ  ఇకపై అంతరిక్ష పరిశోధనలకు అవసరమైన సాంకేతికత కోసం భారత్ ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయంతో ఇకపై ఏ దేశమైనా భారత్‌కు అవసరమైన సాయం అందించేందుకు వెనుకాడదని ఓ జాతీయ ఆంగ్ల వార్తా పత్రికతో మాట్లాడుతూ తెలిపారు. 

“ చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం కావడంతో అంతర్జాతీయంగా అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన నిర్ణయాత్మక ప్రక్రియలలో భారత్ కీలక పాత్ర పోషించనుంది. చంద్రుడిని చేరుకోవడం ద్వారా ఈ రంగంలో భారత్ శక్తి సామర్ధ్యాలను ప్రపంచానికి చాటి చెప్పాం. ఇది స్పేస్ టెక్నాలజీతో భారత్‌ను ముందంజలో ఉంచడమే కాకుండా , భవిష్యత్‌లో గ్రహాన్వేషన్, అక్కడి వనరుల వెలికితీతలో కీలక పాత్ర పోషించేందుకు సాయపడుతుంది” అంటూ ఆయన భరోసా వ్యక్తం చేశారు. 

“గతంలో భారత్‌కు తగిన వనరులు లేక అంతరిక్ష ,అణుశక్తి, విభాగాలతో పాటు ఇతర రంగాల్లో సాంకేతికత కోసం ఇతర దేశాలపై ఆధారపడ్డాం. పలు సందర్భాల్లో సాయం అందించేందుకు ఆ దేశాలు నిరాకరించాయి. చంద్రయాన్ 3 విజయం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది” అని కస్తూరి రంగన్ స్పష్టం చేశారు. కస్తూరి రంగన్ 1990 నుండి 1994 వరకు యూఆర్‌ఎసీ డైరెక్టర్‌గా పనిచేశారు.

రాబోవు రోజులలో అంతరిక్ష వ్యవహారాలలో అంతరిక్ష సాంకేతిక సామర్థ్యం కీలకం కానున్నదని పేర్కొంటూ చంద్రయాన్ 3 తర్వాత ఇక అంతరిక్ష వ్యవహారాలకు సంబంధించి అంతర్జాతీయ నిర్ణయాలు తీసుకొనే ప్రక్రియలో భారత్ తప్పనిసరిగా భాగస్వామిగా ఉండాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు.  ముఖ్యంగా అంతరిక్ష నౌకలు దిగడంకు సంబంధించిన సాంకేతికతతో భారత్ ఇప్పుడు అందరికన్నా ముందంజలో ఉందని వెల్లడించారు.

ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా 21వ శతాబ్దంలో అంతర్జాతీయ సంబంధాల విషయంలో అంతరిక్ష సాంకేతిక సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు భారత్ సమాన హోదాలో పాల్గొని, కీలక అంశాలను అందించే స్థితిలో ఉందని తెలిపారు. అంతరిక్షానికి సంబంధించిన అంతర్జాతీయ నిర్ణయాలు తీసుకోవడంలో మరింత నిర్ణయాత్మక పాత్ర పోషించగలమన్న విశ్వాసాన్ని, భరోసాను మనకు చంద్రయాన్ 3 ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఆయన 9 ఏళ్ల పాటు (1994- 2003) ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలో ఇస్రో తొలి లూనార్ మిషన్‌కు అడుగులు పడ్డాయి. ప్రస్తుతం చంద్రయాన్ 3 విజయం నేపథ్యంలో ఆయన ఆనాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.