మణిపూర్ సీబీఐ కేసుల విచారణ అస్సాంకు బదిలీ

మణిపూర్ లో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలకు సంబంధించిన సీబీఐ కేసుల విచారణను పొరుగు రాష్ట్రమైన అస్సాంకు బదిలీ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఈ కేసుల విచారణకు ప్రత్యేకంగా కోర్టును ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా న్యాయమూర్తులను కేటాయించాలని గువాహటి హైకోర్టును శుక్రవారం ఆదేశించింది. 
 
ఆన్ లైన్ లో విచారణ జరపడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది. గువాహటి కోర్టులో సిబిఐ కేసుల ఆన్‌లైన్ విచారణకు వీలుగా తగిన ఇంటర్‌నెట్ సర్వీసులను సమకూర్చాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.  బాధితులు, సాక్ష్యులు కోరుకుంటే అస్సాంలో విచారణకు నేరుగా హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. 
మణిపూర్ హింసకు సంబంధించిన ఈ కేసులను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం సీబీఐకి అప్పగించింది.  మణిపూర్ హింసలో రెండు వర్గాల్లోనూ బాధితులున్నారని, వారిలో ఎవరికి ఎక్కువ అన్యాయం జరిగింది? ఎవరు ఎక్కువ నష్టపోయారు? ఏ వర్గం ఎక్కువగా హింసకు గురైంది? వంటి వివరాల లోతుల్లోకి తాము వెళ్లాలనుకోవడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
రెండు వర్గాల్లోనూ బాధితులున్నారన్నది వాస్తవమని స్పష్టం చేసింది. ‘‘అటు మైదాన ప్రాంతాల్లోనూ, ఇటు పర్వత ప్రాంతాల్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండు ప్రాంతాల్లోనూ బాధితులున్నారు. నిందితులున్నారు’’ అని వ్యాఖ్యానించింది.