చంద్రుడిపై నడక కొనసాగిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్

విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్ తన పని తాను చేసుకోవడాన్ని మొదలుపెట్టింది. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలపై తన నడకను ఆరంభించినట్లు ఇస్రో తెలిపింది.
 
మూన్ వాక్ మొదలు పెట్టిన రోవర్‌తో బెంగళూరులోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్‌తో అనుసంధానం ఏర్పడిందని వివరించింది. అక్కడి నుంచి డేటా త్వరలోనే అందుతుందని పేర్కొంది. చంద్రయాన్ 3 మిషన్‌కు చెందిన అన్ని కార్యకలాపాలు షెడ్యూల్‌ ప్రకారమే కొనసాగుతున్నాయని, అన్ని వ్యవస్థలు, సజావుగా, సంతృప్తికరంగా పని చేస్తోన్నాయని వివరించింది ఇస్రో. 
 
అందులో పేలోడ్స్‌గా పంపించిన పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ సామాగ్రి మొత్తం యాక్టివ్ అయ్యాయని పేర్కొంది. ల్యాండర్ మాడ్యూల్ పేలోడ్స్ ఇండియన్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ ఇయానోస్ఫియర్, లేజర్ రెట్రోరెఫ్లెక్టర్, చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్సపరిమెంట్.. వంటి పరికరాలు తమ పని మొదలుపెట్టాయని, డేటాను సేకరిస్తోన్నాయని ఇస్రో విశ్లేషించింది.

విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి రోవర్ బుధవారం రాత్రే బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ రోవర్ ల్యాండర్‌కు చెందిన లెగ్ ర్యాంప్ మీదుగా జారుకుంటూ కిందికి దిగింది. దీనికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్పేస్ ఛైర్మన్ పవన్ కే గోయెంకా పోస్ట్ చేశారు. ల్యాండర్ మాడ్యుల్ ల్యాండ్ అయిన మూడు గంటల తర్వాత రోవర్ బయటికి దూసుకొచ్చింది.
 
ల్యాండ్ అయినప్పుడే బయటికి వచ్చేలా ప్రోగ్రామింగ్ చేయలేదు ఇస్రో. దీనికి కారణం లేకపోలేదు. ల్యాండర్ ల్యాండ్ అయిన తర్వాత ఎగిసిన ధూళి మొత్తం అణగి పోయేంత వరకూ అది బయటకు రాకుండా అమర్చారు. ధూళి వల్ల రోవర్ డ్యామేజ్ కాకూడదనే ఉద్దేశంతోనే ఇస్రో శాస్త్రవేత్తలు ఈ జాగ్రత్త తీసుకున్నారు. 
 
బుధవారం  సాయంత్రం 6:04 నిమిషాలకు ల్యాండర్ ల్యాండ్ కాగా, సరిగ్గా రాత్రి 9:04 నిమిషాలకు రోవర్ బయటికి వచ్చింది. ప్రగ్యాస్‌ రెండు ముఖ్యమైన ప్రయోగాలు చేస్తుందని ఇస్రో చైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌ తెలిపారు. దీని బరువు 26 కిలోలు. ఆరు చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ 14 రోజులు పనిచేస్తుంది.  ప్రస్తుతం రోవర్‌ తన అధ్యయనం మొదలుపెట్టిందని చెప్పారు.