ప్రపంచకప్ ఫైనల్ లో ప్రజ్ఞానంద విజృంభణ

చెస్ ప్రపంచకప్ 2023 టోర్నీలో ఉత్కంఠ కొనసాగుతోంది. చరిత్ర సృష్టిస్తూ ప్రపంచకప్ ఫైనల్ చేరిన భారత 18 ఏళ్ల ప్లేయర్ గ్రాండ్‍మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద అదరగొడుతున్నాడు. ఫైనల్‍లోనూ సత్తాచాటుతూ ప్రపంచ నంబర్ 1 ర్యాంకర్ మాగ్నస్ కార్ల్‌సన్‍ను దీటుగా ఎదుర్కొంటున్నాడు.  బుధవారం జరిగిన చెస్ ప్రపంచకప్ 2023 ఫైనల్ రెండో గేమ్ కూడా డ్రాగా ముగిసింది.
మంగళవారం జరిగిన తొలి గేమ్ కూడా సమం కాగా, బుధవారం క్లాసికల్ రెండో గేమ్ కూడా డ్రా అయింది. దీంతో గురువారం  జరిగే టై బ్రేకర్‌లో ఫలితం తేలనుంది. టై బ్రేకర్‌లో గెలిచిన ప్లేయర్‌కు ప్రపంచకప్ టైటిల్ దక్కనుంది. బుధవారం గంటకు పైగా 30 మూవ్స్ పాటు రెండో గేమ్ హోరాహోరీగా జరగగా భారత టీనేజర్ ప్రజ్ఞానంద అదరగొట్టాడు.
మాగ్నస్ కార్ల్‌సన్‍ మొదటి నుంచి డ్రా కోసమే ఆడినట్టు కనిపించింది. మంగళవారం ప్రపంచ నెంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో జరిగిన ఈ క్లాసికల్‌ గేమ్‌ 35 ఎత్తుల వద్ద ఫలితం తేలకుండానే ముగిసింది.  తెల్ల పావులతో ఆట ఆరంభించిన 18 ఏళ్ల ప్రజ్ఞానందను కార్ల్‌సన్‌ ఇబ్బంది పెట్టలేకపోయాడు. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో 35 ఎత్తుల వద్ద ఇరువురు ఆటగాళ్లు డ్రాకు అంగీకరించారు.
భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచకప్‌ ఫైనల్లో ప్రవేశించిన రెండో ఆటగాడిగా ప్రజ్ఞానంద నిలిచారు. ఆదివారం జరిగిన సెమీఫైనల్‌ తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద, అమెరికాకు చెందిన ఫాబియానో కరువానాతో డ్రా చేసుకున్నాడు. ఫాబియానో కరువానా 2వ గేమ్‌ను డ్రా చేసుకోగలిగాడు. అందువల్ల ఫలితాన్ని నిర్ణయించడానికి టైబ్రేకర్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది.
అందుకు తగ్గట్టుగానే సోమవారం జరిగిన టైబ్రేకర్ గేమ్‌లో కూడా 18 ఏళ్ల భారత చెస్ నిర్ణయాత్మక ఎత్తుగడల్లో పట్టు సాధించి గేమ్‌ను డ్రాగా తీసుకెళ్లగలిగాడు. 2వ టైబ్రేకర్ గేమ్‌లోనూ ప్రజ్ఞానంద ఫాబియానో కరువానాను గెలవకుండా అడ్డుకున్నాడు. దీంతో మ్యాచ్ 10+10 టైబ్రేక్‌కు వెళ్లింది. దీని తర్వాత, ప్రజ్ఞానంద మొదటి ర్యాపిడ్ టైబ్రేక్‌ను గెలుచుకోవడం ద్వారా ఫాబియానోపై ఒత్తిడి తెచ్చాడు. చివరకు ప్రజ్ఞానంద 3.5-2.5తో ఫాబియానో కరువానాపై విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించాడు.