నిస్సిగ్గుగా అవినీతి పరులకు సీట్లు ఇచ్చిన కేసీఆర్

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కేసీఆర్ కు ఎదురు దెబ్బ తగలడం ఖాయమని ఆయన ప్రకటించిన 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా చూస్తే అర్థమవుతుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని గతంలో కేసీఆర్ అన్న వ్యాఖ్యలు చూస్తే ఈ సారి పెద్ద ఎత్తున మార్పులు ఉంటాయని అంతా అనుకున్నారని తెలిపారు. 
 
తీరా అభ్యర్థులను చూస్తే 7 చోట్ల మినహా దాదాపు అందరు ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇచ్చారని చెబుతూ కేసిఆర్, ఆయన పార్టీ సిగ్గు తప్పిన విధానాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. కొద్ది రోజుల క్రితం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సమావేశంలో మాట్లాడుతూ కనీసం 20 మంది ఎమ్మెల్యేలు దళిత బంధు పథకంలో 30 శాతం లంచం తీసుకుంటున్నట్లు తనకు సమాచారం ఉందని ఎమ్మెల్యేలను కేసీఆర్ హెచ్చరించారని ఆయన గుర్తు చేశారు. 
 
30 శాతం లంచం తీసుకున్నట్టు ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని, కనీసం 20 మంది కొత్త అభ్యర్థులు ఉంటారని చెప్పారని, అయితే అలా జరగలేదని చెప్పారు. అంటే ఎమ్మెల్యేల అవినీతిని కేసీఆర్ సమర్థించారనే అనుకోవాలని తరుణ్ ఛుగ్ తెలిపారు. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా పాత సీసాలో పాత సారానే తలపించిందని, పాచిపోయిన కూరను మళ్లీ వేడి చేసి ప్రజలకు అందించే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు.
 
పతాక స్థాయికి చేరిన కేసీఆర్, ఆయన ప్రభుత్వ అవినీతిపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారని తరుణ్ చూజ్ స్పష్టం చేశారు. కేసీఆర్ స్వయంగా పెద్ద అవినీతిపరుడని పేర్కొంటూ అవినీతిలో ఆవిష్కరిస్తున్న కొత్త విధానాలకు ఆస్కార్ అవార్డు ఇచ్చేదుంటే కేసీఆర్ ఈ అవార్డుకు అన్నివిధాల అర్హుడని చెప్పవచ్చని ఎద్దేవా చేశారు.
 
బీఆర్ఎస్ చెప్పేదొకటి చేసేదొకటి అంటూ కొద్ది రోజుల క్రితం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత అసెంబ్లీ, పార్లమెంట్‌లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ దిల్లీలో ధర్నాకు దిగారని ఆయన గుర్తు చేశారు. కనీసం బీఆర్ఎస్ అయినా తాము చెప్పింది ఆచరిస్తుందని అనుకున్నామని, అయితే నిన్న కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాలో కేవలం ఏడుగురు మాత్రమే మహిళలు ఉండడం బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతుందని విమర్శించారు. 
 
సొంత పార్టీలో మహిళలకు జరిగిన ఈ దారుణమైన అన్యాయాన్ని కవిత ఎలా సమర్థిస్తారు? అంటూ తరుణ్ ఛుగ్ ప్రశ్నించారు. ఈ జాబితా కేసీఆర్ అవకాశవాదానికి మరో నిదర్శనం అని చెబుతూ ఇటీవల ముగిసిన మునుగోడు ఎన్నికల్లో నియోజకవర్గంలో కొంత ఉనికి ఉందని సీపీఐ, సీపీఎంలతో దోస్తీ కట్టి, రెండు పార్టీలతో ఇక నుంచీ కలిసి ఉంటామని ప్రకటించారని బిజెపి నేత గుర్తు చేశారు. 
 
మునుగోడు ఎన్నికలు ముగిసిన ఆరు నెలల తర్వాత కేసీఆర్ వారిని వదిలేశారని అంటూ ఇదీ కేసీఆర్ నైజం అని తెలిపారు. తన స్వలాభం కోసం ప్రజలను వాడుకుని, పని పూర్తయ్యాక వదిలేస్తాడని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆయన ఇదే చేశారని ధ్వజమెత్తారు. విద్యార్థులను, ఉద్యోగులను, నిరుద్యోగులను ఉద్యమానికి ఉపయోగించుకుని, రాష్ట్రం ఏర్పడ్డాక వారికి ద్రోహం చేశారని తెలిపారు. 
 
కేసీఆర్ అవకాశవాదం, ద్వంద్వ వైఖరి, వాడుకొని వదిలేసే విధానం గురించి తెలుసుకున్న ప్రజలు తమ ఓటుతో బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలోకి కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని తరుణ్ ఛుగ్ ధీమా వ్యక్తం చేశారు.  తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని చెబుతూ నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇలా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 
 
తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్షలు సాకారం చేసుకునేందుకు, కుటుంబ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకు బిజెపి వైపు ఆశగా చూస్తున్నారని ఆయన తెలిపారు. బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ తో తమ ఆకాంక్షలు నెరవేరుతాయని భావిస్తున్నారని చెబుతూ తెలంగాణ ప్రజలకు బిజెపి అన్నివిధాలా అండగా ఉంటుందని, వారి కలలను సాకారం చేస్తుందని భరోసా వ్యక్తం చేశారు.