ఉస్మానియా టివి ద్వారా ‘చంద్రయాన్ -3’ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారం

చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం చివరి అంకానికి చేరుకుంది. వ్యోమనౌక బుధవారం సాయంత్రం జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనున్నది. సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌, ప్రగ్యాన్‌ రోవర్‌తో కూడిన ల్యాండర్‌ మాడ్యూల్‌ చంద్రుడిపై కాలుమోపనున్నది.
చంద్రయాన్‌-3 చందమామపై దిగే అద్భుతాన్ని రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి చూపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థుల కోసం లైవ్‌ స్ట్రీమింగ్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దాంతో డీఈవోలకు, ప్రిన్సిపల్స్‌కు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 
ఆ మేరకు తెలంగాణ విద్యా ఛానెల్స్‌ అయిన టీ శాట్‌, నిపుణలో లైవ్‌ టెలికాస్ట్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రత్యేక స్క్రీన్‌లు, ప్రొజెక్టర్‌లను సిద్ధం చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 5.20 గంటల నుంచి టీ శాట్‌, నిపుణ ఛానెళ్లలో లైవ్‌ ప్రారంభం అవుతుంది. సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రుడిపై దిగనుంది.
 
కాగా, బుధవారం సాయంత్రం 4:30 నుండి 6.15 గంటల వరకు ఉస్మానియా టివి ద్వారా ‘చంద్రయాన్- 3’ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. లైవ్ సెషన్ బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతుందని, చంద్రయాన్ విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత సాయంత్రం 6.15 గంటలకు ముగుస్తుందని ఉస్మానియా యూనివర్శిటీ ఒక ప్రకటనలో తెలిపింది. 
 
ఈ సందర్భంగా లైవ్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేశామని, బృంద చర్చలో శశికాంత్ సాల్వి, ఆపరేషన్స్ డైరెక్టర్ (రిటైర్డ్), ఎన్‌ఆర్‌ఎస్‌సి హైదరాబాద్, ఎన్. రఘునందన్ కుమార్, డైరెక్టర్, ప్లానెటరీ సొసైటీ, ఇండియా, ప్రొఫెసర్. పి. నవీన్ కుమార్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం, నోడల్ ఆఫీసర్ (ఇస్తో ఓయూ ) , డాక్టర్ కె. చెన్నా రెడ్డి, ఉస్మానియా ఖగోళ శాస్త్ర విభాగ అధ్యాపకులు పాల్గొంటారని వెల్లడించింది.
 
దక్షిణాఫ్రికా నుంచే ప్రధాని వీక్షణ
 
మరోవంక, 15వ బ్రిక్స్ సదస్సు-2023లో పాల్గొనేందుకు మంగళవారంనాడు దక్షిణాఫ్రికా రాజధాని జోహాన్నెస్‌బర్గ్ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం సౌతాఫ్రికా నుంచే ”చంద్రయాన్-3” వర్చువల్ ప్రోగ్రాంలో పాల్గోనున్నారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుని నేలను ముద్దాడే ఉత్కంఠ భరిత క్షణాలను ప్రజలంతా తిలకించేందుకు ‘ఇస్రో’ అన్ని ఏర్పాట్లు చేసింది. 
 
ఈ ఉద్విగ్నభరిత సన్నివేశాలను ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్, ఫేస్‌బుక్, డీడీ నేషనల్ టీవీలలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ ప్రత్యక్ష ప్రసారం బుధవారం సాయంత్రం 5.20 గంటల నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది.