మైనర్‌పై గ్యాంగ్‌ రేప్.. గవర్నర్ దిగ్బ్రాంతి

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. నగరంలో ఇటీవల మూగ, చెవిటి మహిళపై అత్యాచారం జరిగిన ఘటన మరువక ముందే తాజాగా హైదరాబాద్‌లోని మీర్‌పేట్ నందనవనంలో ఓ మైనర్ బాలికపై గంజాయి మత్తులో ఉన్న యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడటం సంచలనంగా మారింది. 
గంజాయి మత్తులో ఉన్న యువకులు బాలిక ఇంట్లోకి దూరి మెడపై కత్తి పెట్టి బెదిరించి మరీ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. బాలిక సోదరుడి ముందే యువకులు ఈ నీచానికి పాల్పడ్డట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
 
కాగా, మీర్‌పేటలో జరిగిన అత్యాచారంపై తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నందనవనం కాలనీలో పదహారేళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్, 48 గంటల్లో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, రాచకొండ సీపీని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు తక్షణమే బాధితురాలి నివాసానికి వెళ్లి, ఆమె కుటుంబానికి అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని ఆమె కోరారు.
 
మీర్‌పేట్ బాలికపై అత్యాచారం కేసులో విచారణ కొనసాగుతోందని ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ తెలిపారు. బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ముగ్గురు అత్యాచారం చేసినట్లు గుర్తించామని,నిందితుల కోసం ఏడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. బాలికపైన అత్యాచారం చేసిన నిందితులు అందరూ స్థానికులే అని తెలిపారు. బాలికకు వైద్య చికిత్సలు పూర్తి చేశామని, మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
 
నందనవనం పరిసర ప్రాంతాల్లో గంజాయి వినియోగంపై దృష్టి పెట్టామన్నారు. గతంలో కూడా గంజాయి అరికట్టడంలో రాచకొండ పోలీస్ ముందుందని వెల్లడించారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వారు కూడా గంజాయి బ్యాచ్ గానే అనుమానిస్తున్నామని డీసీపీ సాయి శ్రీ పేర్కొన్నారు.