కాంగ్రెస్ – ఆప్ బంధంకు ఢిల్లీలో గ్రహణం!

కేంద్రంలోని నరేంద్ర మోదీ  ప్రభుత్వాన్ని ఉమ్మడిగా 2024 ఎన్నికలలో ఓడించడం కోసం 26 పార్టీలు కలిసి ఏర్పర్చిన `ఇండియా’ కూటమికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మహారాష్ట్రాలో ఎన్సీపీలో చీలిక ఏర్పడి, మెజారిటీ వర్గం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరగా, మరో కీలక భాగస్వామి ఆప్ విషయంలో కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఢిల్లీ, పంజాబ్ లలో సీట్ల సర్దుబాటు విషయంలో ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత ప్రశ్నార్ధకంగా మారింది. ఢిల్లీలో మొత్తం 7 సీట్లకు పోటీ చేయబోతున్నామని సంకేతం కాంగ్రెస్ ఏకపక్షంగా ఇవ్వడంతో ఆప్ కు కూటమి నుండి బైటకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది.

కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీ విభాగం నేతలతో బుధవారం సమావేశమై ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించారు.  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో నాలుగు గంటల సేపు జరిగిన ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్, ఢిల్లీ విభాగం చీఫ్ చౌదరి అనిల్ కుమార్, ఇన్‌చార్జి దీపక్ బబరియా, అల్కా లంబా, హరూన్ యూసుఫ్, అజయ్ మాకెన్, తదితరులు పాల్గొన్నారు.

మొత్తం 7 సీట్లలోనూ పోటీచేయాలని, కేవలం ఏడు నెలల వ్యవధి మాత్రమే ఉన్నందున ఏడు సీట్లలోనూ పార్టీ గెలుపుకోసం కార్యకర్తలందరినీ సిద్ధం చేయాలని సమావేశం నిర్ణయించినట్టు అల్కా లంబా సమావేశం అనంతరం మీడియాకు చెప్పారు.  మరోవంక, కాంగ్రెస్ ఢిల్లీ యూనిట్‌తో అధిష్ఠానం పెద్దలు జరిపిన సమావేశంలో ఆప్‌తో పొత్తు ప్రస్తావన చోటు చేసుకోలేదని పార్టీ ఇన్‌చార్జి దీపక్ బబరియా తెలిపారు.  లంబా ప్రకటనతో పార్టీకి సంబంధం లేదన్నట్లు ఈ విషయమై మాట్లాడే అధికారం పార్టీ ఆమెకు ఇవ్వలేదని చెప్పారు.

ఈ పరిణామంపై ఆప్ నేతలు భగ్గుమంటున్నారు. ”ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంటే ఇండియా కూటమి సమావేశంలో ఆప్ పాల్గొనడంలో అర్ధం లేదు. సమయం వృథా చేసుకోవడమే అవుతుంది. అయితే, పార్టీ అధిష్ఠానమే దీనిపై అంతిమ నిర్ణయం తీసుకుంటుంది” అని ఆప్ ప్రతినిధి ప్రియాంక కాకర్ స్పష్టం చేశారు. 

ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాత్రం దీనిపై పార్టీ కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు.  వాస్తవానికి ఢిల్లీ, పంజాబ్ లలో సీట్ల సర్దుబాటు గురించి ఇదివరకే మల్లిఖార్జున్ ఖర్గే, అరవింద్ కేజ్రీవాల్ ప్రాధమిక చర్చలు జరిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఈ విషయంలో తదుపరి చర్చలు జరుపుతారని ఖర్గే చెప్పారు.

సూత్రప్రాయంగా ఢిల్లీలో 2, పంజాబ్ లో 7 సీట్లకు కాంగ్రెస్ పోటీ చేయాలని, ఢిల్లీలో 5, పంజాబ్ లో 6 సీట్లకు ఆప్ పోటీ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.  పైగా, హర్యానా, గుజరాత్ లలో కూడా ఒకొక్క సీట్ ఆప్ కు వదలాలని పట్టుబడుతున్నారు. ఈ అంశంపై రెండు పార్టీలు ఇంకా ఒక అవగాహనకు రాకుండానే ఢిల్లీలో అన్ని సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసేందుకు సిద్ధపడటం కాంగ్రెస్ – ఆప్ ల మధ్య పరస్పరం అవిశ్వాసం నెలకొన్నట్లు స్పష్టం చేస్తుంది.