తిరుమల నడక మార్గంలో చిక్కిన మరో చిరుత

వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుమల వెళ్లే భక్తులను చిరుత పులుల సంచారం తీవ్రభయాందోళనకు గురి చేస్తోంది. ఈక్రమంలోనే గత కొద్ది రోజులుగా చిరుతలు కాలి నడక మార్గంలో వెళ్లే భక్తులపై దాడి చేయడం, చిన్నపిల్లలను నోట కురుచుకొని అడవిలోకి ఎత్తుకెళ్లడం వంటివి చూసిన భక్తులు, టీటీడీ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. 
 
తాజాగా కాలి నడక మార్గానికి దగ్గరలో టీటీడీ అధికారులు, తిరుపతి ఫారెస్ట్‌ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో బుధవారం మరో చిరుత చిక్కింది. మూడు రోజుల క్రితం బోనులో చిక్కిన ప్రాంతానికి సమిపంలోనే మరో బోను ఏర్పాటు చేశారు. మొత్తం మూడు ప్రాంతాల్లో బోనులు పెట్టగా..బుధవారం మరొకటి చిక్కింది. 
 
ఇప్పటి వరకు 50 రోజుల వ్యవధిలో మొత్తం మూడు చిరుతలను బంధించారు అధికారులు. ఇవే కాకుండా మోకాలి మిట్ట, లక్ష్మినరశింహస్వామి ఆలయం, 35వ మలుపు దగ్గర మొత్తం మూడు బోనులు ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమల కొండపైకి వెళ్లే భక్తులపై నడకమార్గంలో అడవి జంతువుల దాడి భయపెడుతోంది.
 
ఈక్రమంలోనే గత కొద్దిరోజులుగా ఇద్దరు చిన్నారులపై దాడి చేయగా ఒకరు గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు. మరో చిన్నారి చిరుత చేతిలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలి నడక మార్గంలో వెళ్లాలంటే భక్తులు భయపడే పరిస్థితి నెలకొంది.  అందుకే టీటీడీ, అటవీ  అధికారులు కాలి నడక మార్గం సమీపంలో మోకాలి మిట్ట, లక్ష్మినరశింహస్వామి ఆలయం, 35వ మలుపు దగ్గర మొత్తం మూడు బోనులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోనుల్లో ఇప్పటికి వరకు అంటే 50రోజుల వ్యవధిలోనే మూడు చిరుతలను బంధించారు.
 
ఇప్పటికే తిరుమల కొండపైకి కాలి నడక మార్గంలో వెళ్లే భక్తులకు టీటీడీ చేతి కర్రలు అందజేస్తోంది. వన్యప్రాణులు దాడి చేయడానికి వస్తే స్వియరక్షణ కల్పించుకోవడం కోసం ఈ తరహా ఆలోచన చేసింది టీటీడీ. మరోవైపు తెల్లవారుజామున, సాయంత్రం వేళ పిల్లలను నడక మార్గంలో కొండపైకి రావద్దంని హెచ్చరిస్తోంది.  నడక మార్గంలో పంచె వేసే ఆలోచన కూడా చేస్తున్నారు.
కాగా, మెట్లమార్గంలో భక్తులకు రక్షణగా కంచె ఏర్పాటు చేయాలన్న సూచన అమలు చేయడం కుదరదని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. చిరుతల స్వేచ్ఛా సంచారానికి కంచె ఏర్పాటుతో అడ్డంకి సృష్టించినట్టు అవుతుందని అంటున్నారు. చిరుతలన్నీ పెద్దవే కావడంతో కంచె‌ను దాటి కూడా అవి దాడి చేయగలవని హెచ్చ‌రిస్తున్నారు.
 
విశాలంగా విస్తరించిన తిరుమల అడవులలో అక్రమ కలప రవాణా, జంతువుల వేట పెరుగుతూ ఉండడంతో  జంతువులు జనారణ్యంలోకి ప్రవేశిస్తున్నాయనే పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎర్ర చందనం సహా విలువైన కలపను ఇష్టారాజ్యంగా నరికివేస్తున్నారని విమర్శలు చెలరేగుతున్నాయి. అడవులలో అక్రమాలు చేస్తున్న వారికి ప్రభుత్వంలోని పెద్దలు, ఉన్నతాధికారుల అండదండలు ఉంటున్నాయని, వారిని కట్టడి చేయకుండా నడకమార్గంలో చేపట్టే చర్యలతో ప్రయోజనం ఉండదని సహితం పలువురు భావిస్తున్నారు.
శ్రీశైలంలో అప్రమత్తం
 
ఇదే సమయంలో రాష్ట్రంలోని మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఆలయ పరిధిలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారంపై అటవీ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. రాత్రి పూట జంతువులు ఆలయ పరిధిలోకి రాకుండా టపాసులు కాల్చాలని నిర్ణయించినట్లు శ్రీశైలం దేవస్థాన ఈవో లవన్న తెలిపారు. 
 
త్వరలో ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఫెన్సింగ్ నిమిత్తం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సహకారంతో రూ.5 కోట్ల 30 లక్షలకు టెండర్ పిలుస్తామని చెప్పారు. వచ్చే రెండేళ్లలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భక్తులకు రక్షణ కల్పిస్తామని లవన్న వెల్లడించారు.