ముస్లింలు అందరూ హిందూ మతం నుండి మారినవారే!

ముస్లింలు అందరూ హిందూ మతం నుండి మారినవారే!
ఇస్లాం కన్నా హిందూమతం చాలా పురాతనమైనదని, దేశంలో ఉన్న ముస్లింలు అందరూ హిందూ లేదా సిఖ్ మతాల నుండి మారినవారే  అని మాజీ కేంద్ర మంత్రి, గతంలో కాంగ్రెస్ లో కీలక నేత  గులాబీ నబి ఆజాద్ సంచలన వాఖ్యలు చేశారు.  దోడా జిల్లాలో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ఇలా అన్నారు: “మనకు కాశ్మీర్ ఉదాహరణ ఉంది. 600 సంవత్సరాల క్రితం కాశ్మీర్‌లో ముస్లిం లేడు. కాశ్మీరీ పండిట్లను ఇస్లాం మతంలోకి మార్చారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఆ విధంగా జరిగింది”. 
 
ఇస్లాం 1500 సంవత్సరాల క్రితం వచ్చింది కాగా, హిందూ మతం చాలా పురాతనమైనదని డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అధినేత  ఆజాద్ చెప్పారు. “ఇస్లాం బయటి నుండి వచ్చి ఉండాలి, 10-20 మంది మొఘల్ సైన్యం నుండి వచ్చి ఉండాలి. మిగిలిన వారు హిందూ-సిక్కుల నుండి మారారు” అంటూ ఆయన చేసిన ప్రసంగం వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 
 
వీడియోలో ఆజాద్, “మేము హిందువులు, ముస్లింలు, దళితులు, కాశ్మీరీల కోసం రాష్ట్రాన్ని నిర్మించాము. ఇది మా భూమి, బయటి నుండి ఎవరూ ఇక్కడికి రాలేదు. నేను పార్లమెంటులో చాలా విషయాలు చూశాను.అవి మీవరకు చేరుకోలేదు” అంటూ తెలిపారు.
 
“మన తోటి ఎంపీ ఒకరు కొందరు బయటి నుంచి వచ్చారని అన్నప్పుడు నేను కొట్టిపారేసాను. మన హిందుస్థాన్‌లో ఇస్లాం మతం కేవలం 1500 ఏళ్లనాటిది. హిందూ మతం చాలా పాతది. కాబట్టి మొఘలుల కాలంలో వారి సైన్యంలో 10-20 మంది బయటి నుంచి వచ్చి ఉండాలి. మిగిలిన వారందరూ భారతదేశంలో హిందువుల నుండి ముస్లింలుగా మారారు.  మన కాశ్మీర్ దీనికి ఉదాహరణ” అని స్పష్టం చేసిన్నట్లు వెల్లడించారు.
 
“మనలో ఎవ్వరూ బయట నుండి వచ్చిన వారు కాదు. మన అందరి మూలాలు ఈ నెలలోనే ఉన్నాయి” అని తేల్చి చెప్పారు. ఆగస్టు 2022లో, గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్ష పదవిని తిరస్కరించారు.  కాంగ్రెస్ జమ్మూ, కాశ్మీర్ రాష్ట్ర యూనిట్ రాజకీయ వ్యవహారాల కమిటీకి కూడా రాజీనామా చేశారు.
 
కమిటీని నియమించిన కొద్ది గంటల్లోనే పదవులను స్వీకరించేందుకు నిరాకరించి పార్టీని వీడారు. తర్వాత, గులాం నబీ ఆజాద్ తన స్వంత రాజకీయ పార్టీ డెమోక్రటిక్ ప్రోగ్రెస్ ఆజాద్ పార్టీని స్థాపించారు. కొంత కాలంగా, గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వాన్ని, ముఖ్యంగా నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని నిరంతరం విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
 
ఆయన తన ఆత్మకథ పుస్తకంలో కాంగ్రెస్ పార్, నాయకత్వంలోని లోపాలను ఎత్తి చూపుతూ అనేక సవివరమైన సంఘటనలను పొందుపరిచారు. ఆయన విమర్శలకు ప్రతిస్పందిస్తూ, కాంగ్రెస్ నాయకులు వివిధ సందర్భాల్లో ఆయనను ‘ద్రోహి’ అని అభివర్ణించారు.