మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్ ల్లో బీజేపీ తొలి జాబితా

అప్పుడే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్థుల‌ తొలి జాబితాను బిజెపి ప్ర‌క‌టించింది. ఆ రెండు రాష్ట్రాల్లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల సంఘం ఆ ఎన్నిక‌ల‌కు చెందిన తేదీల‌ను ఇంకా ప్ర‌క‌టించ‌క‌ముందే బీజేపీ త‌న తొలి జాబితాను విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. అయితే తదుపరి మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.
90 మంది ఎమ్మెల్యేలు ఉండే చ‌త్తీస్‌ఘ‌డ్ అసెంబ్లీకి తొలి జాబితాలో 21 మంది అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించింది. ఇక 230 మంది ఎమ్మెల్యేలు ఉండే మ‌ధ్య‌ప్ర‌దేశ్ కోసం తొలి లిస్టులో 39 మందిని ఖ‌రారు చేశారు. అభ్య‌ర్థుల మ‌ధ్య గంద‌ర‌గోళాన్ని త‌గ్గించేందుకే ముంద‌స్తుగా తొలి జాబితాను విడుదల చేసిన‌ట్లు భావిస్తున్నారు.
ఈ రెండు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్, తెలంగాణ, మిజోరాంలలో కూడా ఎన్నికలు జరుగనున్నాయి.
వీటిల్లో మిజోరాంలో మాత్రమే బిజెపి అధికారంలో ఉంది. పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా అధ్యక్షతన బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ, జెపి నడ్డాల సమక్షంలో జరిగిన పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ జాబితాలను సిద్ధం చేశారు.  మరోవంక, రాజస్థాన్ లో పార్టీ ఎన్నికల కమిటీని, మేనిఫెస్టో కమిటీలను బీజేపీ ప్రకటించింది.
రెండుసార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధర రాజే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌ను నియమించారు.  మేఘ్వాల్ రాజస్థాన్ ఎంపీ, అనుభవం ఉన్న నాయకుడు. ఈ కమిటీలో రాజ్యసభ ఎంపీలు కిరోరి లాల్ మీనా, ఘనశ్యామ్ తివారీ కో-కన్వీనర్లుగా ఉంటారు. కిరోరి, తివారీ ఇద్దరూ కూడా రాజ్యసభ ఎంపీలు.
 
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ వసుంధర రాజే గురించి మాట్లాడుతూ ఆమె సీనియర్ నాయకురాలని, పార్టీ తరపున ప్రచారం చేస్తానని చెప్పారు. రాజే ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు రాజస్థాన్ సీఎంగా ఉన్నారు.  అదే సమయంలో, రాజస్థాన్‌లో, దళిత సామాజిక వర్గానికి చెందిన అర్జున్ రామ్ మేఘవాల్‌కు పార్టీ పెద్ద బాధ్యతను అప్పగించింది.
మేఘ్వాల్ తొలిసారిగా 2009లో రాజస్థాన్‌లోని బికనీర్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2013లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. రాజకీయాల్లోకి రాకముందు మేఘ్వాల్ రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. 2009, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. రాజకీయాలలోకి రాకముందు ఆయన ఐఏఎస్ అధికారి.