గుంటూరు -బీబీనగర్ రైల్వే లైన్ డబ్లింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో రైల్వే లైన్ల అభివృద్ధికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు- బీబీనగర్ మధ్య ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్‌లో 239 కిమీ రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ బుధవారం నాడు ఆమోదం తెలిపింది. ఇందుకోసం కేంద్రం రూ. 3238 కోట్లు ఖర్చు చేయనుంది.  దీంతో హైదరాబాద్‌- చెన్నై మ ధ్య 76 కి.మీ. దూరం తగ్గనుంది.
త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వ వర్గాలు ప్రకటించాయి. డబ్లింగ్‌ పూర్తయితే ప్రయాణికులకు దూరభారం తగ్గనున్నది. రైళ్ల సంఖ్య పెరుగనుండగా సరుకు రవాణా మరింత సులభతరం కానున్నది.  ఇదే రూట్‌లో దేశంలోనే ప్రసిద్ధి చెందిన రైస్‌ ఇండస్ట్రీ, సిమెంట్‌ ఇండస్ట్రీ, గ్రానైట్‌, ఐరన్‌ అండ్‌ కెమికల్‌ పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఎఫ్‌సీఐ గిడ్డంగులు ఇలా అనేక పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా సరుకు రవాణా కూడా పెద్ద ఎత్తున సాగుతుంటుంది.

బుధవారం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ డబ్లింగ్‌ పనులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. దాంతో ఇప్పటికే సింగిల్‌ లైన్‌కు అనుసంధానంగా మరో మార్గం నిర్మించనున్నారు. దీని వల్ల సికింద్రాబాద్‌- గుంటూరు మీదుగా విజయవాడకు దగ్గరి మార్గం కానుంది. ప్రస్తుతం భువనగిరి-కాజీపేట- ఖమ్మం మార్గంలో విజయవాడకు ఎక్కువ రైళ్లు నడుపుతున్నారు. 

డబ్లింగ్‌ పూర్తైతే ఇక్కడి నుంచి మరింతగా రైళ్ల సంఖ్య పెరుగనున్నది. దాంతో పాటు రైళ్ల రాకపోకల సమయం కూడా బాగా తగ్గనున్నది. ఇప్పటివరకు సింగిల్‌ ట్రాక్‌లో ఒక రైలు వస్తుందంటే మరో రైలును ఏదో ఒక స్టేషన్‌లో నిలుపాల్సి వస్తుంది. ఇకపై ఆ ఇబ్బందులు తప్పనున్నాయి.  అదేవిధంగా రూ. 5655.4 కోట్ల అంచనా వ్య యంతో ముద్కేడ్‌మేడ్చల్, మహబూబ్‌నగర్‌డోన్ మధ్య రైల్వేలైన్ (502. 34 కి.మీ.) డబ్లింగ్‌కు ఆమోదం లభించింది. తద్వారా హైదరాబాద్‌బెంగళూరు మధ్య 50 కి.మీ దూరం తగ్గనుంది. 

మరోవైపు ఏపీలో నెర్గుండి బారాంగ్, ఖుర్దారోడ్ విజయనగరం మధ్య (417.6 కిమీ) 5618 26 కోట్ల అంచనా వ్యయంతో మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అలాగే విశాఖపట్నం -చెన్నై మధ్య మూడో రైల్వే లైన్ డిపిఆర్ సిద్ధం కాగా, రూ. 3వేల కోట్ల ఖర్చుతో నిర్మాణ పనులు జరగనున్నాయి.

దేశవ్యాప్తంగా ఏడు బహుళ ట్రా క్ (మల్టీ ట్రాకింగ్)ప్రాజెక్టులకు కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇందుకోసం దాదాపు రూ. 32,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుల వల్ల రైలు ఆపరేషన్లలో రద్దీ తగ్గి, ప్రయాణ, రవాణా సౌకర్యాల్లో మరింత వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో 35 జిల్లాలకు ఈ పథకం విస్తరిస్తుంది. దీనివల్ల ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్‌వర్క్ 2339 కిమీ వరకు విస్తరిస్తుంది.