తెలంగాణ రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ తేనీటి విందు కార్యక్రమానికి మంత్రులు, రాజకీయ నేతలు హాజరు కాలేదు. దీంతో ఎట్ హోం కార్యక్రమం వెలవెలబోయింది.
తేనీటి విందు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు.
వరుసగా మూడోసారి రాజ్ భవన్ ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఎట్‌హోంలో కనిపించకలేదు. తెలంగాణ బీజేపీ తరపున కీలక నేతలు కూడా ఎట్ హోం కార్యక్రమానికి దూరంగా ఉండడం గమనార్హం.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజిపి అంజనీ కుమార్, టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, స్వాతంత్య్ర సమరయోధులు, పలువురు ప్రముఖులు గవర్నర్ ఎట్ హోంకు హాజరయ్యారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసై స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు సీఎం గైర్హాజరవడం మంచిదికాదని హితవు చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తమిళనాడు గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వెళ్లకపోవడం బాధకరమని ఆమె తెలిపారు.
తాను గవర్నర్‌గా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇలానే వ్యవహరిస్తున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి తనను తీవ్రంగా బాధించిందని చెబుతూ గవర్నర్, సీఎం మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని ఆమె సూచించారు. కాగా, పెండింగ్ బిల్లులపై స్పందించేందుకు ఇది సమయం కాదని గవర్నర్ రాజ్‌భవన్‌లో గవర్నర్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమంలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ చెప్పారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం.. శాసనసభ, మండలిలో 12 బిల్లులను పాస్ చేసి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆమోదం కోసం పంపించింది. ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించిన తర్వాతే చట్టరూపం దాల్చి, అమల్లోకి రానున్నాయి. బిల్లుల విషయానికి వస్తే గతంలో గవర్నర్ తిప్పి పంపిన 3 బిల్లులు, తిరస్కరించిన ఒక బిల్లును ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తెలిపి మళ్లీ గవర్నర్ వద్దకు పంపారు.
More Stories
ఇన్కాయిస్కు సుభాష్ చంద్ర బోస్ పురస్కారం
20 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం?
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు