తెలంగాణ క్రీడా మంత్రి పేషీ నుండే క్రీడాకారిణికి వేధింపులు

 
క్రీడాకారిణులు రక్షణ కల్పించి, వారిని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వ వ్యవస్థలు వారి పట్ల కంటకంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో క్రీడాకారిణులపై వేధింపులకు సంబంధించిన వరుస ఘటనలు వెలుగులోకి రావడం కలకలం రేపుతున్నాయి. హకీం పేట స్పోర్ట్స్ హాస్టల్ ఉదంతం మరువక ముందే మంత్రి పేషీలో పనిచేసే ఉద్యోగి వేధింపులు వ్యవహారం వైరల్‌గా మారింది.
 
తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పేషీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌‌గా పనిచేసే సురేందర్‌ అనే ఉద్యోగికి జాతీయ స్థాయి క్రీడాకారిణి బంధువుతో జరిపిన సంభాషణ వైరల్‌గా మారింది. తన కుమార్తె వరుసయ్యే అమ్మాయిని మంత్రి దగ్గర పనిచేసే ఉద్యోగి వేధిస్తున్నాడని తెలిసి హెచ్చరించిన సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలంగాణకు చెందిన ఓ జాతీయ క్రీడాకారిణి తన బంధువుతో కలిసి మంత్రిని కలిసేందుకు ఆయన పేషీకి వెళ్లారు. మంత్రిని కలిసేందుకు క్రీడాకారిణి వెళ్లిన సమయంలో ఆమె ఫోన్‌ నంబరును అడిగి తీసుకున్న సురేందర్‌ ఆ తర్వాత ఆమె ఫోన్‌ నంబరుకు మెసేజీలు పంపడం ప్రారంభించాడు. అవి శృతి మించి అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతుండటంతో బాధితురాలు తన బాబాయికి వాటిని పంపింది.
ఫోన్ మెసేజీల్లో ‘నీ వయసెంత? పర్సనల్‌ ఫొటోలు పంపు… పర్సనల్‌గా కలవాలి, మాట్లాడాలి’ అంటూ మెసేజీలు పంపాడు. సురేందర్‌ వేధింపుల్ని భరించలేకపోయిన యువతి, మంత్రి వద్దకు తీసుకెళ్లిన బంధువుకు విషయం చెప్పి వాపోయింది. దీంతో ఆయన సురేందర్‌కు ఫోన్‌ చేశారు.‘మా అమ్మాయికి అసభ్యంగా మెసేజ్‌లు పెడుతున్నావట’ అని నిలదీశారు.
మరో ఇద్దరు, ముగ్గురు అమ్మాయిల పట్ల కూడా ఇలానే తప్పుగా వ్యవహరించావని తెలిసిందని అతడిని నిలదీశారు. అతని వ్యవహారాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించాడు.  మొదట తనకేమీ తెలియదన్నట్లుగా మాట్లాడిన సురేందర్‌, అతనను పంపిన మెసేజ్‌లన్నీ తనవద్ద ఉన్నాయని బాధితురాలి బంధువు స్పష్టం చేయడంతో తప్పయిందని ఒప్పుకొన్నాడు. అంతా మనసులోనే పెట్టుకోవాలని బ్రతిమాలాడు. విషయం బయటపెడితే తాను రోడ్డున పడతానని బతిమాలాడాడు.

బాధితురాలికి క్షమాపణలు చెప్పాలని యువతి బంధువు స్పష్టం చేశారు. ఆ తర్వాత ఈ ఆడియో సంభాషణ వైరల్‌గా మారింది. క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పేషీ ఉద్యోగి క్రీడాకారిణులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వెలుగులోకి రావడం కలకలం రేపింది. సురేందర్‌ నిర్వాకం సోషల్‌ మీడియాలో కలకలం రేపడంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అతడిని విధుల నుంచి తొలగించారు.