మార్చ్ లోగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం!

వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగడానికి ముందే మార్చ్ లోగా కర్ణాటకలో మూడు నెలల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం తధ్యమని కేంద్ర మాజీ మంత్రి, బిజాపూర్ (విజయపుర సిటీ) బిజెపి ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచనల ప్రకటన చేశారు. బెంగళూరులో సోమవారంనాడు జరిగిన ఓ కార్యక్రంలో మాట్లాడుతూ, 135 సీట్లు గెలిచినప్పటికీ కాంగ్రెస్‌కు నిద్ర పట్టడం లేదని చెప్పుకొచ్చారు.

30 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడితే సిద్దరామయ్య ప్రభుత్వం కుప్పకూలుతుందనే భయంతో ఉందని తెలిపారు. అయితే, ఇప్పటికే 25 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఆయన వెల్లడించారు. దానితో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. తన నియోజవర్గమైన విజయపురలో ముస్లిం అధికారులను నియమిస్తున్నారని యత్నాల్ ఆరోపించారు. 

ముస్లిం అధికారులైనప్పటికీ తాను ఎమ్మెల్యేనని, అధికారులు తన మాటకు కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. హిందువులను అణిచివేసేందుకు ఏ అధికారి ప్రయత్నించినా జనవరిలో తాము మళ్లీ అధికారంలోకి వస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.  లోక్‌సభ ఎన్నికలకు ముందే మార్చిలోగా కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని భరోసా వ్యక్తం చేశారు.

కర్ణాటక రాష్ట్రం అవినీతికి నిలయంగా మారుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ్ రాయరెడ్డి ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.  ఆ పార్టీ సొంత ఎమ్మెల్యేలే స్వయంగా ఆ మాట చెబుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఖర్చు చేయడానికి కాంగ్రెస్‌ నేతలు డబ్బుల కోసం వెంపర్లాడుతున్నారని చెప్పారు.

బదిలీల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోందని, ఎన్నికల హామీల అమలుకు డబ్బులు వెచ్చిస్తుండటం వల్ల నిధుల కొరత తలెత్తిందని, దీనిపై ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉందని చెప్పారు. మరోవంక, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సింగపూర్‌లో కుట్ర జరుగుతోందని విపక్ష నేతలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు.