ఢిల్లీ లక్ష్యంగా ఉగ్రదాడులకు పాక్ మూకల కుట్రలు ?

స్వాతంత్య్ర దినోత్సవం వేళ దేశ రాజధాని ఢిల్లీ పూర్తిగా భద్రతా బలగాల పరిధిలోకి వెళ్ళింది. పాక్‌ మద్దతు గల ఉగ్రవాద మూకలు ఢిల్లీలో దాడులకు దిగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మొత్తం 10 వేల మంది పోలీసులను మోహరించి అడుగడుగునా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 
 
ఆగస్టు 15న సైనిక స్థావరాలు, బహిరంగ ప్రదేశాల్లో దాడులకు పాక్‌కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. ఉగ్రవాదులు ముఖ్యంగా ఢిల్లీనే టార్గెట్ చేసుకుని దాడులకు దిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి. దీంతో ఢిల్లీలోని భద్రతా దళాలను అప్రమత్తం చేశారు.
 
బయటి ఉగ్ర సంస్థలే కాకుండా దేశంలో ఉన్న కొన్ని ఉగ్ర మూకలు కూడా దాడులు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని సెక్యూరిటీ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పటిష్ఠ బందోబస్తు చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీతోపాటు నగర పరిసరాల్లోని పలు పర్యాటక ప్రాంతాలు, ఇతర ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని కొన్ని ఉగ్ర సంస్థలు పనిచేస్తున్నట్లు తొలిసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలకు సమాచారం వచ్చింది. 
 
పాక్‌లోని లష్కరే ఆపరేటీవ్‌ ఒకరు మే నెలలో ఢిల్లీలోని కీలక ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించమని ఇక్కడ ఉన్న వారి అనుచరులకు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందులో కొన్ని కీలక మార్గాలు, రైల్వే స్టేషన్లు, ఢిల్లీ పోలీసు ఆఫీస్‌లు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హెడ్‌క్వార్టర్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఢిల్లీలో హై అలర్ట్ విధించాయి.
 
మరోవైపు ఢిల్లీ సహా పలు నగరాల్లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ దాడులు చేయనుందని ఈ ఏడాది మే నెలలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ఓ వేర్పాటువాది ప్రకటించడం సంచలనంగా మారింది. దీంతోపాటు అంతర్గత వామపక్ష తీవ్రవాదులు, సిక్కు మిలిటెంట్‌ గ్రూపులు, ఈశాన్య భారత దేశంలోని వేర్పాటు వాద సంస్థల నుంచి కూడా దాడులు జరగవచ్చని హెచ్చరికలు వచ్చాయి. 
ఆగస్టు 15 సందర్భంగా భద్రతా సంస్థలు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఢిల్లీ పోలీసులతో పాటు ఇతర ఏజెన్సీలకు చెందిన సుమారు 10వేల మందికిపైగా ఎర్రకోట వద్ద మోహరించారు. అలాగే ప్రత్యేక శిక్షణ పొందిన కమాండోలను యమునా నదిలో మోహరించారు. దీంతో పాటు డ్రోన్లతో ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎర్రకోట నుంచి ఢిల్లీ సరిహద్దుల వరకు ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి ఢిల్లీ సరిహద్దులను మూసివేయనున్నారు.
దాదాపు 1000 ఫేషియల్‌ రికగ్నైషన్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటికి తోడు కీలక ప్రదేశాల్లో యాంటీ డ్రోన్‌ వ్యవస్థలను మోహరించారు. ముఖ్యంగా ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో అణువణువూ గాలింపు చేపడుతున్నారు. అనుమానిత వస్తువులు, వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. సరిహద్దుల్లో వాహనాలను తనిఖీ చేసిన తర్వాత ఢిల్లీలోకి అనుమతించనున్నారు.
అలాగే సరిహద్దుల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఉగ్రవాదులు, దుండగులకు సంబంధిన సమాచారం విషయంలో ఢిల్లీ పోలీసులు పొరుగు రాష్ట్రాల పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎర్రకోట దగ్గర పీసీఆర్ వ్యాన్ నిరంతరం గస్తీ తిరుగుతున్నది. ఎన్‌ఎస్‌జీ, ఎస్‌పీజీ, పారామిలటరీ బలగాలు, ఢిల్లీ పోలీసుల సిబ్బందిని మోహరించారు. ఎర్రకోట వద్ద యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌ని మోహరించారు. దీని సహాయంతో ఎర్రకోట పరిసరాల్లో ఎగిరే ఎలాంటి వస్తువునైనా నియంత్రించనున్నది.