కల్లోలిత సమయాల్లో కూడా అభివృద్ధిలో భారత్‌

కల్లోలిత సమయాల్లో కూడా భారత్‌  ప్రతికూల పరిస్థితులను ధృఢంగా ఎదుర్కుని అభవృద్ధే లక్ష్యంగా ముందుకు సాగిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 77వ స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి దేశ ప్రజల నుద్ధేశించి ఆమె ప్రసంగిస్తూ 2047 సంవత్సరానికల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ కూడా నిలవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. 
 
ఈ లక్ష్య సాధన దిశలో దేశ ప్రజలందరు ఐక్యంగా ముందుకు సాగాలని ఆమె పిలుపిచ్చారు. అనేక రంగాల్లో దేశం ముందుకెళుతోందని చెబుతూ తనకు ఎదురైన సవాళ్ళను అవకాశాలుగా మలుచుకుని అప్రతిహతంగా ముందుకు సాగుతోందని ఆమె చెప్పారు. జి-20 దేశాల్లో భారతదేశ పాత్రను అమె ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ విద్యా, శాస్త్ర రంగాల్లో ముందంజ వేస్తున్నామని పేర్కొన్నారు.
 
‘‘ప్రతి భారతీయుడూ సమాన పౌరుడే. ఈ నేలపై ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, హక్కులు. బాధ్యతలు ఉన్నాయి’’ అని చెప్పారు. దేశంలో అందరికీ ఒకే గుర్తింపు ఉందని తెలిపారు. భారతీయ పౌరుడు అన్నదే ప్రధాన గుర్తింపు అని; కులం, జాతి, భాష అన్న గుర్తింపులు దీని ముందు నిలవవని పేర్కొన్నారు. 
 
ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లిలాంటిదని, కూకటివేళ్ల నుంచే ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయని విఆమె వరించారు.  ప్రపంచంలోనే ప్రముఖ ఆర్థిక శక్తిగా దేశం ఎదుగుతోందని రాష్ట్రపతి చెప్పారు. ద్రవ్యోల్బణం ప్రపంచానికే ఇబ్బందికరంగా మారిందని, కానీ కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు కృషితో దేశం మాత్రం ఆ సమస్య నుంచి తప్పించుకొందని చెప్పారు. సవాళ్లును అవకాశాలుగా మార్చుకొని దేశం ముందుకు సాగుతోందని రాష్త్రపతి తెలిపారు.
 
జాతీయ విద్యా విధానం, 2020ని, చంద్రయాన్‌-3 విజయవంతంగా ప్రయోగించడాన్ని ఆమె ప్రస్తావించారు. చంద్రయాన్‌ను విజయవంతంగా ప్రయోగించడంలో ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ఆమె కొనియాడారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ఆమె కోరారు. ఇందుకోసం స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో కృషి జరగడం చాలా అవసరమని చెప్పారు. 
 
మన రాజ్యాంగమే మనకు మార్గదర్శి పత్రమని స్పష్టం చేస్తూ మన జాతి నిర్మాతలు కన్న కలలను సాకారం చేసేందుకు సామరస్యత, సోదర భావంతో కలిసిమెలిసి మనందరం ముందుకు సాగాలని ముర్ము పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులపై అత్యవసరంగా శాస్త్రవేత్తలు, విధానకర్తలు దృష్టి పెట్టాలని ఆమె కోరారు. 
 
పర్యావరణ ప్రయోజనాల కోసం స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో కృషి జరగడం చాలా అవసరమని రాష్ట్రపతి చెప్పారు. ఆదివాసీలు తమ ఆచార సాంప్రదాయాలను మరింత పరిపుష్టం చేసుకుంటూనే మరోవైపు ఆధునిక భావజాలాన్ని అలవరుచుకోవాలని ముర్ము పిలుపునిచ్చారు. 
 
సమాజంలో అణచివేతకు గురైర వారికి ప్రాధాన్యతనివ్వడమనేది మనం అనుసరించే విధానాల ఏకైక మూల సూత్రమని ఆమె తెలిపారు. ఫలితంగానే గత దశాబ్ద కాలంలో పెద్ద సంఖ్యలో ప్రజలు దారిద్య్రం నుండి బయటపడ్డారని ఆమె చెప్పారు. అన్నదాతలకు దేశం రుణపడి వుందని పేర్కొంటూ  అభివృద్ధి లక్ష్యాలను, మానవతా సహకారాన్ని మరింత పెంపొందించడంలో భారత్‌ కీలకమైన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. 
 
అంతర్జాతీయ వేదికలపై కూడా తన సత్తా చాటుతోందని చెబుతూ మొత్తంగా ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు జి 20 దేశాల్లోనే  వున్నారని రాష్త్రపతి గుర్తు చేశారు. అంతర్జాతీయ ప్రాధాన్యతలను, సరైన దిశలో పెట్టగలిగేందుకు ఇదొక విశిష్టమైన అవకాశమని పేర్కొంటూ భారత్‌ దాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలని ఆమె కోరారు. దేశ ప్రజలకు కులం,మతం, ప్రాంతాలుగా రకరకాల గుర్తింపులున్నప్పటికీ భారత పౌరులన్నది అన్నింటికి మించిన గుర్తింపని చెప్పారు.