హిమాలయ రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం

భారీ వర్షాలు, వరదలు హిమాలయ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండ చరియలు ఎక్కడివక్కడ కూలుతున్నాయి. నదులు, వాగులు పొంగుతుండటంతో పలు ప్రాంతాల్లో రైల్వే లైన్లు కొట్టుకుపోయాయి. అధికారిక సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రానికి వర్షాలు, వరదలు బారిన పడి హిమాచల్ ప్రదేశ్ లోనే 51 మంది మరణించారు. 
 
పౌరులంతా ఇళ్లలోనే ఉండాలని, కాలువలు, నదుల వద్దకు వెళ్లకూడదని హిమాచల్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు హెచ్చరించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో నివసించేవారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.  కొండప్రాంతాల్లో కొండచరియల బీభత్సం, లోతట్టు ప్రాంతాల్లో బురద ప్రవాహం ఉధృతంగా ఉన్నట్లు తెలిపారు. సిమ్లాలో లోతట్టు ప్రాంతాల్లో చాలా ఇళ్లు బురద, మట్టి కింద కూరుకుపోయాయని పేర్కొన్నారు.
 
సిమ్లాలో ఆలయం వద్ద దుర్ఘటనతోపాటు మరోచోట కొండచరియలు విరిగిపడడంతో రెండు చోట్లా మరణాల సంఖ్య 14కి పెరిగిందని సిమ్లా డిప్యూటీ కమిషనర్‌ ఆదిత్య నేగి తెలిపారు. ఇక్కడ 19 మందిని కాపాడినట్లు ఎస్పీ సంజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.  భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయని, రెండు జాతీయ రహదారులు సహా 752 రోడ్లను మూసివేశామని అధికారులు తెలిపారు. 
 
చంబా, కాంగ్రా, హమీర్‌పూర్‌, మండీ, బిలా్‌సపూర్‌, సోలన్‌, సిమ్లా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఒక్కరోజే వర్షాల కారణంగా రూ.7,020.28 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. జతోగ్‌-సమ్మర్‌ హిల్స్‌ రైల్వేస్టేషన్‌ మధ్య ట్రాక్‌ ధ్వంసమైంది. 
జూన్‌ 24న రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి రాష్ట్రంలో 257 మంది మృతిచెందారని, 32 మంది గల్లంతవ్వగా.. 290 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌కు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు.

ఉత్తరాఖండ్‌ను కూడా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడం, కొండచరియలు విరిగిపడుతుండడంతో చార్‌ధామ్‌ యాత్రను మంగళవారం వరకు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.  డెహ్రాడూన్, నైనిటాల్ సహా ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 60 మంది మరణించగా, 17 మంది గల్లంతయ్యారు.

మరోవైపు రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి జిల్లా మెజిస్ట్రేట్‌లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డెహ్రాడూన్, పౌరి, టెహ్రి, నైనిటాల్, చంపావత్, ఉధం సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 

ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న భారీ వర్షాలతో బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్లే జాతీయ రహదారులు బ్లాక్ అయ్యాయి. రుద్రప్రయాగ్, దేవ్ ప్రయాగ్, శ్రీనగర్‌లలో గంగా, మందాకిని, అలక్‌సంద నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండగా, కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారులు మూసివేశారు.