తిరుమల కాలి మార్గంలో 15 ఏళ్ల లోపు పిల్లలకు నిషేధం

తిరుమలలో చిరుతల సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల నడక మార్గాల్లో చిన్న పిల్లల అనుమతిపై ఆంక్షలు విధించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్ల లోపు పిల్లలకు నడకదారుల్లో అనుమతి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
 
 15 ఏళ్లపై బడిన భక్తులను మాత్రం అలిపిరి కాలిబాట మార్గంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతించనున్నట్లు టీటీడీ పేర్కొంది. మరోవైపు నడకదారిలో పోలీసులను అప్రమత్తం చేసింది. ఏడో మైలు వద్ద చిన్న పిల్లల చేతికి పోలీసులు ట్యాగ్ లు వేస్తున్నారు. 
 
దీంతో పిల్లలు తప్పిపోయినా, అనుకోని ఘటనలు జరిగినా సులభంగా కనిపెట్టేందుకు ఈ ట్యాగ్‌లు ఉపయోగపడతాయని టీటీడీ తెలిపింది.  పిల్లలకు వేస్తున్న ట్యాగ్‌పై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్‌ నంబర్, పోలీసుల టోల్‌ ఫ్రీ నంబర్‌ నమోదు చేస్తున్నారు. 
 
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 15 ఏళ్ల లోపు చిన్నారులను నడక మార్గంలో అనుమతించనున్నారు. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గంలో టీటీడీ ఈ ఆంక్షలు విధించింది. అదేవిధంగా రెండు ఘాట్‌ రోడ్లలో సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలుపుదల చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండో ఘాట్ రోడ్డులో బైక్‌లకు అనుమతిస్తారు.

తిరుమల నడకమార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో టీటీడీ అప్రమత్తమై పలు చర్యలు చేపట్టింది. రెండు కాలినడక మార్గాలను సాయంత్రం 6 గంటలకు మూసేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపింది.  టీటీడీ ఛైర్మన్‌, అధికారులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అలాగే ప్రతి 10 మీటర్లకు ఒక సెక్యూరిటీ గార్డును నియమిస్తామని తెలిపారు. నడక మార్గంలో వచ్చే భక్తులు చిన్న పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

కాగా తిరుమల శేషాచలం అడవుల్లో చిరుతల సంఖ్య పెరిగిందని గుర్తించారు. ఒకటీ రెండూ కాదని, ఒక్క శనివారం నాడు ఐదు ప్రాంతాల్లో వేర్వేరు చిరుతలు సంచరించడం చూశామని అటవీసిబ్బంది చెప్పడంతో టీటీడీ అప్రమత్తమైంది. ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో ఆదివారం అర్థరాత్రి చిరుత చిక్కింది. అలిపిరి నడక దారిలోని ఏడో మైలు దగ్గర ఏర్పాటు చేసిన బోనులో చిక్కగా.. దాని వయసు ఐదేళ్లు ఉంటుందని చెబుతున్నారు.