తిరుమల నడక మార్గంలో ప్రతి 10 మీటర్లకు ఒక గార్డు

తిరుమల నడక మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటనపై టీటీడీ తీవ్రంగా స్పందించింది. ఇటీవల వన్య మృగాలు తరచూ కాలినడక మార్గంలోకి రావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. చిరుత దాడిలో మృతి చెందిన బాలిక కుటుంబానికి టీటీడీ, ఫారెస్ట్‌ అధికారులు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. టీటీడీ తరపున రూ.5 లక్షలు, అటవీశాఖ తరపున మరో రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

అలిపిరి కాలినడక మార్గంలో తల్లిదండ్రులతో కలసి వెళ్తున్న ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసి హతమార్చింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలేనికి చెందిన ఆటో డ్రైవర్‌ దినేశ్‌కుమార్‌ కుటుంబ సభ్యులతో పాటు శుక్రవారం మధ్యాహ్నం తిరుపతికి చేరుకున్నారు. ఐదేళ్ల కుమారుడు లిఖిత్‌ తలనీలాలు సమర్పించేందుకు భార్య శశికళ, కుమార్తె లక్షిత, మరో ఐదుగురు కలసి మధ్యాహ్నం 3గంటలకు అలిపిరి నుంచి తిరుమలకు నడక మొదలుపెట్టారు. 

రాత్రి 7.30గంటల సమయంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో వారి కుమార్తె లక్షిత(6) కనిపించకపోవడాన్ని గుర్తించారు. పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆ చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో దగ్గర్లోని సెక్యూరిటీ సిబ్బంది ద్వారా రాత్రి 10.30గంటలకు పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐలు జగన్మోహన్‌రెడ్డి, చంద్రశేఖర్‌ సిబ్బందితో అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం నడక మార్గానికి 150 అడుగుల దూరంలో ఓ కొండపై లక్షిత మృతదేహాన్ని గుర్తించారు. ఆమె మెడ, తలతో పాటు కుడికాలును చిరుత తినేసి పోయినట్టు గుర్తించారు.

చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటన నేపథ్యంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల నడకమార్గంలో భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా నడకమార్గంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది.  ఇప్పటివరకు మెట్ల ద్వారా ఎవరికి వారు ఒంటరిగా పోతున్నారు. ఇలా పోవడం వల్ల ఒక్కొక్కసారి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు కాపాడటానికి కూడా ఎవరూ ఉండటం లేదు. 

ఇలాంటి సమయంలో సహాయం చేయడానికి పక్కన ఎవరూ ఉండే పరిస్థితి ఉండదు. దీంతో ఇక నుంచి 100 మందిని కలిపి ఒక గుంపుగా ఏర్పాటు చేసి పంపనున్నారు. అలాగే ఈ 100 మంది భక్తులకు పైలట్‌గా సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించింది. ఇక 7వ మైలు నుంచి నరసింహస్వామి దేవాలయం వరకు హైఅలర్ట్ జోన్‌గా టీటీడీ ప్రకటించింది. 

దీంతో పాటు భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందుపైపు, వెనుకవైపు రోప్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఏదైనా ఘటన జరిగినప్పుడు వెంటనే తెలుసుకోవడానిక వీలుగా 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తాజాగా టీటీడీ అధికారులు నిర్ణయించారు.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని టిటిడి చైర్మన్ బి. కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులపై శనివారం సాయంత్రం అధికారులతో ఆయన మాట్లాడారు. లక్షిత మృతదేహం లభించిన ప్రాంతాన్ని అధికారులతో భూమన పరిశీలించారు. జూన్‌ 22న ఇలాంటి ఘటనే జరిగిన నేపథ్యంలో భక్తుల భద్రత విషయంపై టిటిడి ఇప్పటికే అనేక జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. 

అటవీ, పోలీస్‌, తితిదే అధికారులతో చర్చించి భద్రతా పరమైన ప్రతిపాదనలు చేస్తే టిటిడి ఖర్చుతో ఏర్పాటు చేస్తామని చెప్పారు. అటవీ సంరక్షణ చట్టాలు సమర్థంగా అమలు జరుగుతున్నందువల్ల వన్య ప్రాణుల సంఖ్య కూడా పెరిగిందని, భక్తులు వీటి బారిన పడకుండా ఎలా రక్షణ కల్పించాలనేదే టిటిడికి ముఖ్యమని తెలిపారు. 

 కాగా,చిన్న పిల్లలతో నడక మార్గంలో తిరుమలకు వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను పక్కకు వదలొద్దని విజ్ఞప్తి చేశారు  ప్రతి 10 మీటర్లకు ఒక సెక్యూరిటీ గార్డును నియమిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రెండు కాలినడక మార్గాలను సాయంత్రం 6 గంటలకు మూసేయాలని ఆలోచిస్తున్నామని చెప్పారు.