భారత్ లో కూడా కొత్త వేరియంట్‌ కేసులు

మొన్నటి వరకు ప్రపంచాన్ని వణించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే, ఇటీవల యూకేలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేసుల పెరుగుదలకు ప్రధానంగా కొత్త ఎరిస్‌ ప్రధానకారణమని తెలుస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త వేరియంట్‌ను ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా వర్గీకరించింది. 
 
ఈ కరోనా వేరియంట్‌ స్వభావాన్ని తెలుసుకునేందుకు అధ్యయనాలు కొనసాగుతున్నాయి. అయితే, కొత్త వేరియంట్‌ కేసులు భారత్‌లో కూడా కనిపించినట్లు వార్తతులు వస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.  ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  కొత్త వేరియంట్‌తో తీవ్రమైన ప్రమాదమేమి ఉండదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నాయి.
అయితే, వేరియంట్‌లో ఉత్పరివర్తనాలను పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇన్ఫెక్టివిటీ గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.  ప్రజలలో ఇన్ఫెక్షన్లు వేగంగా పెరగడానికి ఇదే కారణమని ఇప్పటి వరకు జరిగిన పలు పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఈ వేరియంట్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌కు చెందిన సబ్‌వేరియంట్‌. తీవ్రమైన వ్యాధి, ఆసుపత్రిలో చేరే అవకాశం తక్కువగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు.

భారతదేశంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొత్త వేరియంట్‌ల ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని జీనోమ్ సీక్వెన్సింగ్‌పై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని చెప్పారు. దేశంలో కరోనా సంక్రమణ ప్రమాదం తక్కువగా ఉందని, అయితే ప్రజలందరూ వైరస్‌ సోకకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇప్పటివరకు తెరపైకి వచ్చిన ఒమిక్రాన్‌ అన్ని సబ్‌ వేరియంట్స్‌తో ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.  కొత్త వేరియంట్ మే నెలలోనే భారత్‌లో వెలుగు చూసింది. మే-జూన్‌లో భారతదేశంలో దీనిని గుర్తించినట్లు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ కరోనా వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా తెలిపారు. 

ఈ సబ్‌ వేరియంట్‌ కారణంగా గత రెండు నెలల్లో దేశంలో కేసుల్లో పెరుగుదల, ఆసుపత్రిలో చేరిక కేసుల్లో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతానికి వేరియంట్‌పై ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కరోనా ఇన్ఫెక్షన్‌ను నివారించేందుకు సాధారణ నియమాలు పాటిస్తే సరిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ కొత్త వేరియంట్ పేరెంట్ XBB.1.9.2తో పోల్చితే స్పైక్‌లో మరికొన్ని ఉత్పరివర్తనలు ఉన్నాయని ప్రాథమిక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ మ్యుటేషన్ ఇంతకు ముందు ఇతర కరోనావైరస్ వేరియంట్లలోనూ కనిపించింది. ఈ రూపాంతరం ఎలాంటి సమస్యలకు దారి తీస్తుందో ఎప్పుండు అంచనా వేయలేమని నిపుణులు పేర్కొంటున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా వెలుగు చూసిన 35శాతం కరోనా వేరియంట్లలో 465 ఉత్పరివర్తనాలు ఉన్నాయి. కరోనా కొత్త వైవిధ్యాలతో ఇన్ఫెక్షన్‌ ప్రపంచదేశాల్లో పెరుగుతున్నా తీవ్రమైన పరిస్థితులు కనిపించడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.  కొమొర్బిడిటీ బాధితులు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిలో మాత్రమే ఎక్కువ ప్రమాదం కనిపిస్తుందని పేర్కొంటున్నారు. 

స్క్రిప్స్ ట్రాన్స్‌లేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎరిక్ టోపోల్ మాట్లాడుతూ ప్రాథమికంగా ఎక్స్‌బీబీ సిరీస్‌లోని వేరియంట్ల కంటే రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేశారు.