‘ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లు’కు రాష్ట్రపతి ఆమోదం

ఢిల్లీ సర్వీస్​ బిల్లు ఎట్టకేలకు చట్టరూపం దాల్చింది. తాజాగా ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో బ్యూరోక్రాట్ల నియామకాలు, బదిలీలకు సంబంధించిన బిల్లును ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.   దీంతో బిల్లు చట్టరూపం సంతరించుకుంది. ఈమేరకు భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.
పార్లమెంటు ఉభయసభలు ఆమోదించిన నేషనల్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. ఇకనుంచి ఢిల్లీలో ఉన్నతాధికారుల నియామకం, బదిలీలకు సంబంధించి తుదినిర్ణయం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తీసుకోనున్నారు.  ఢిల్లీ ప్రభుత్వంలోని సీనియర్ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాన్ని కేంద్రానికి కట్టబెట్టే ఢిల్లీ సర్వీసుల బిల్లును ఆగస్టు 3న మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. ఓటింగ్‌కు ముందే విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. 
 
అటూ రాజ్యసభలోనూ గట్టి పోటీ ఎదురైనప్పటికీ బిల్లు గట్టెక్కింది. బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు పోలయ్యాయి. వ్యతిరేకంగా 102 ఓట్లు పడ్డాయి. 26 పార్టీల ఇండియా కూటమి నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైనప్పటికీ, టీడీపీ, బీజేడీ, వైఎస్ఆర్‌సీపీ వంటి విపక్ష పార్టీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశాయి. అధికారుల నియామకం, బదిలీల అంశంపై ఆప్‌ సర్కార్‌ చాలా రోజులుగా కేంద్రంపై పోరాడుతోంది.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మే 11న అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లుబాటు కాకుండా మే 19న కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చింది.  ఇటీవల ముగిసిన వర్షాకాల సమావేశాల్లో ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టగా.. ఉభయసభలు ఆమోదించాయి. ఇప్పుడు తాజాగా రాష్ట్రపతి ముర్ము ఆమోదం పొందడంతో బిల్లు చట్టరూపం దాల్చింది.