పోలింగ్ బూత్‌ల ఆక్రమణకై గూండాలకు టీఎంసీ కాంట్రాక్టు

పోలింగ్ బూత్‌ల ఆక్రమణ కోసం గూండాలకు కాంట్రాక్టు ఇచ్చారని ప్రధాని నరేంద్ర  మోదీ పశ్చిమ బెంగాల్‌ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల జరిగిన పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆ పార్టీ రక్తంతో ఆడుకుందని విమర్శించారు.
 
పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ క్షేత్రీయ పంచాయతీ రాజ్ పరిషత్ సమావేశాన్ని ఉద్దేశించి శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడుతూ టీఎంసీ రాష్ట్రంలో రాజకీయాలు చేసే తీరు ఇదేనని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలను బెదిరించడానికి హింసను ఆయుధంగా వాడుకున్నారని ఎండగట్టారు. ఇన్ని రకాల బెదిరింపులు ఉన్నప్పటికీ, పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతలను అభినందించారు.
ఆ పార్టీ ఓటర్లను బెదిరిస్తోందని, వారి జీవితాలను నరకం చేస్తోందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ బెదిరించిందని, పోలింగ్ బూత్‌లను ఆక్రమించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  బీజేపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయకుండా అన్ని రకాలుగా టీఎంసీ అడ్డుకుందని మండిపడ్డారు.
బీజేపీ కార్యకర్తలను మాత్రమే కాకుండా, ప్రజలను కూడా టీఎంసీ నేతలు, కార్యకర్తలు బెదిరించారని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి తమను తాము చాంపియన్లుగా అభివర్ణించుకునే వారే ఈవీఎంలను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని ప్రధాని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘టీఎంసీ పార్టీ గూండాలకు కాంట్రాక్టు ఇచ్చి ఓట్ల లెక్కింపు రోజున బూత్‌ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. అంతటితో ఆగకుండా తమ పని పూర్తి చేయడానికి ప్రాణాంతక దాడులకు పాల్పడింది’ అని ప్రధాని పేర్కొన్నారు.
 
లోక్ సభలో తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ప్రతిపక్ష పార్టీలను బిజెపి ఓడించిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు సభ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయాయని ఎద్దేవా చేశారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ఆ పార్టీలు భయపడ్డాయనేది సత్యమని తెలిపారు. దేశమంతా నైరాశ్యం నింపుతున్నవారికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దీటుగా సమాధానం చెప్పిందని తెలిపారు. 
 
మణిపూర్ సమస్యపై చర్చించాలనే ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదని, అందుకే ఆ పార్టీల నేతలు అవిశ్వాస తీర్మానంపై చర్చలో కేవలం ఆరోపణలు మాత్రమే చేశారని, తర్కబద్ధత లేకుండా మాట్లాడారని ప్రధాని విమర్శించారు. బీజేపీ నేతలు ఎటువంటి అహంకారం లేకుండా పని చేస్తున్నారని, ప్రజల మనసులను గెలుచుకుంటున్నారని చెప్పారు. కోల్‌కతాలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు.