‘న్యూస్‌క్లిక్‌’కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్‌ కేసులో వీరిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దం టూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌కు మెరిట్‌ ఉందని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంఉందని న్యాయమూర్తి జస్టిస్‌ సౌరభ్‌ బెనర్జీ వ్యాఖ్యానించారు. 

ఈ నోటీసులపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ను, పుర్కాయస్థను బెంచ్‌ ఆదేశించింది. ఈ కేసు విచారణ వచ్చే నెల 6న జరగనుంది. ఈడీ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ  ఇది భారీ నేరపూరిత కుట్ర అని, పెయిడ్‌ న్యూస్‌ కోసం న్యూస్‌క్లిక్‌కు కోట్లాది రూపాయలు అందాయని పేర్కొన్నారు. 

ఈ కేసు విచారణను ఇన్నాళ్లుగా వాయిదా వేస్తూ వచ్చిన ఈడీ ఇప్పుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని న్యూస్‌క్లిక్‌ తరఫు న్యాయవాది వాదించారు. తాము దాఖలు చేసిన ఇతర వ్యాజ్యాలతో కలిపి ఈ పిటిషన్‌ను స్వీకరించాలన్న న్యూస్‌క్లిక్‌ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

 పెండింగ్‌లో ఉన్న ఇతర కేసులతో సంబంధం లేకుండా ఇది స్వతంత్రంగా ఉందని పేర్కొంది. చైనాకు అనుకూలంగా ప్రచారానికి గాను న్యూస్‌క్లిక్‌’ పోర్టల్‌కు అమెరికా టెక్‌ దిగ్గజం నెవిల్లే రాయ్‌ సింఘమ్‌ నుంచి భారీగా నిధులు అందుతున్నట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ఆరోపించిన కొద్ది రోజులకే ఈడీ ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. 

కాగా, ఈకేసు విచారణ సందర్భంగా పోర్టల్‌, వ్యవస్థాపకుడిపైనా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఈడీని ఆదేశిస్తూ 2021లో ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

250మందికి పైగా ప్రముఖుల లేఖ

మరోవంక, చైనాకు అనుకూలంగా ప్రచారానికి గాను న్యూస్‌క్లిక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు ప్రముఖులు కోరారు. ఈ మేరకు పలువురు మాజీ న్యాయమూర్తులు, రాయబారులు సహా 250మందికి పైగా ప్రముఖులు రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. చైనాలో తయారైన ఫేక్‌న్యూ్‌సతో భారతీయ పన్ను చెల్లింపుదారులను తప్పుదారి పట్టించే కుతంత్రాలు పన్నుతున్నారని ఆ లేఖలో ఆరోపించారు.