భారత్ నాలుగోసారి ఆసియా హాకీ టైటిల్ కైవసం

ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ 2023 ఫైనల్‍లో భారత హాకీ జట్టు అద్భుత విజయం సాధించింది. తుదిపోరులో మలేషియాపై గెలిచి ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‍ను టీమిండియా నాలుగోసారి దక్కించుకుంది. ఓ దశలో 1-3తో వెనుకబడిన భారత జట్టు ఆ తర్వాత సత్తా చాటి విజయం సాధించింది.   చెన్నైలోని మేయర్ రాధాకృష్ణ స్టేడియం వేదికగా చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో శనివారం టీమ్‌ఇండియా 4-3తో మలేషియాను మట్టికరిపించి నాలుగోసారి ట్రోఫీ చేజిక్కించుకుంది.
భారత సారథి హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’ అవార్డు దక్కింది.  ఫైనల్‌ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌, తమిళనాడు  సీఎం స్టాలిన్‌ విజేతలకు బహుమతులు అందించారు. టోర్నీ మొత్తంలో పరాజయం ఎరగకుండా ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియాకు  తుదిపోరులో మలేషియా నుంచి గట్టిపోటీ ఎదురైంది.
 
నాలుగోసారి ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ కైవసం చేసుకున్న టీమ్‌ఇండియాకు తమిళనాడు సీఎం స్టాలిన్‌ నగదు పురస్కారాలు ప్రకటించారు. జట్టులోని సభ్యులు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షలు ఇవ్వనున్నారు. మ్యాచ్‌ ఆరంభంలో జుగ్‌రాజ్‌ సింగ్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌కు శుభారంభం అందించాడు. అయితే ఆ తర్వాత మలేషియా వరుసగా మూడు గోల్స్‌ కొట్టి ఆధిపత్యం కనబర్చింది.
 
భారత్ తరఫున జుగ్‍రాజ్ సింగ్ (9వ నిమిషం), కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ (45వ నిమిషం), గుర్జాంత్ సింగ్ (45వ నిమిషం), అక్షదీప్ సింగ్ (56వ నిమిషం) గోల్స్ చేశారు. మలేషియా టీమ్‍లో అబుల్ కమల్ అజ్రాయ్ (14వ నిమిషం), రజీ రహిమ్ (14వ ని.) అమీనుద్దీన్ మహమ్మద్ (28వ ని.) గోల్స్ చేశారు.
 
ఈ ఫైనల్‍లో భారత జట్టు మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. 9వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను జుగ్‍రాజ్ గోల్‍గా మలిచాడు. ఆ తర్వాత కూడా టీమిండియా ఆటగాళ్లు అటాకింగ్ ఆట ఆడారు. అయితే, మలేషియ ప్లేయర్ అజ్రాయ్ 14వ నిమిషంలో గోల్ చేయగా.. మరిన్ని క్షణాల్లోనే రహీమ్ మరో గోల్ బాదాడు.
 
 దీంతో భారత్ 1-2తో వెనుకబడింది. అలాగే, 28వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను మలేషియా ప్లేయర్ మహమ్మద్ గోల్ చేశాడు. దీంతో హాఫ్ టైమ్ సమయానికి టీమిండియా 1-3తో వెనుబడింది. రెండో హాఫ్ ఆరంభంలోనూ టీమిండియా తీవ్రంగా పోరాడినా గోల్ రాలేదు. 43వ నిమిషంలో మలేషియాకు పెనాల్టీ కార్నర్‌ రాగా భారత జట్టు అడ్డుకుంది. 
 
అయితే, 45వ నిమిషంలో అద్భుతం జరిగింది. పెనాల్టీ స్ట్రోక్‍తో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ గోల్ సాధించగా కొన్ని సెకన్ల వ్యవధిలోనే గుర్జాత్ సింగ్ మరోసారి బంతిని గోల్ పోస్టులోకి పంపాడు. దీంతో గోల్స్ 3-3తో సమయ్యాయి. మలేషియా ఆ తర్వాత జోరు పెంచింది.  అయితే, 56వ నిమిషంలో భారత ప్లేయర్ మన్‍దీప్ బంతిని చాకచక్యంగా పాస్ చేయగా గోల్ చేశాడు అక్షదీప్ సింగ్. దీంతో 4-3తో భారత్ దూసుకెళ్లింది. చివరి వరకు ఆధిక్యాన్ని నిలుపుకొని విజయం సాధించింది. ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‍ను నాలుగుసారి కైవసం చేసుకుంది భారత జట్టు.