ఏపీలో పరిస్థితులపై రాష్ట్రపతి జోక్యం కోరిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న విపరీత పరిస్థితుల కారణంగా తనకున్న విశేషాధికారాలతో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విన్నవించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిష్టితులను వివరిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలకు విడివిడిగా తొమ్మిది పేజీల లేఖలను వ్రాసారు. 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న హింస, నిరంకుశ పాలన, అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజ్యాంగ సంస్థల విధ్వంసం, న్యాయ వ్యవస్థ, కేంద్ర సంస్థలపై దాడులు ఆ లేఖలో వివరించారు. తనపై పదేపదే జరుగుతున్న దాడులపై సిబిఐ చేత విచారణ జరిపించాలని కోరారు.

తనపై జరుగుతున్న దాడుల వెనుక నేరపూరిత కుట్ర ఉందని పేర్కొన్న ఆయన, వాటిని ప్రాణాంతక దాడులుగా అభివర్ణించారు. ఈ లేఖల్లో ఆయన రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదిన జరిగిన ఒక బహిరంగ సభలో సిఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఉద్దేశ్యపూర్వకంగానే తన భద్రతను తగ్గించినట్లు అర్ధమౌతోందని పేర్కొన్నారు. 

తనపై దాడులు చేస్తూ అదే సమయంలో తనపైనే హత్యాయత్నం ఆరోపణతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని తెలిపారు. తన భద్రతను పునరుద్ధరించిన హైకోర్టు పట్ల కూడా జగన్‌పూర్తి ధిక్కారాన్ని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. 2019 ఆగస్టు నుంచి మొన్నటి అంగళ్లు ఘటన వరకు తనపై జరిగిన దాడులు, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం అనుసరించిన విధానాలను లేఖలో కూలంకుషంగా వివరించారు.

ఈ లేఖలో ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ఆగస్టు 4న అంగళ్లులోని మూడు రోడ్ల కూడలిలో తనపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పుంగనూరు పట్టణంలోకి తనను అనుమతించబోమని వైసిపి గూండాలు బహిరంగంగానే ప్రకటించినా స్థానిక పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని తెలిపారు. 

గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంపై గతంలో డ్రోన్‌లు ఎగురవేశారని,మంత్రి జోగి రమేష్‌ తన నివాసంపై 2021లో దాడి చేసినా ఇప్పటికీ చర్యలు లేవని పేర్కొన్నారు. పోలీసుల పర్యవేక్షణలోనే వైసిపి గుంపు తనపై రాళ్లు రువ్వుతుందని వివరించారు. నందిగామ, యర్రగొండపాలెంలో తనపై ఇలాంటి దాడులు జరిగాయని తెలిపారు. 

నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి సీనియర్‌ వైద్యులు సుధాకర్‌ మరణం, వైసిపి ఎంపి రఘురామకృష్ణంరాజు పోలీసు కస్టడీ, టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు అరెస్టులను వివరించారు. టిడిపి కార్యాలయంపై దాడి ఘటన, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యను రాజకీయ ప్రత్యర్ధులపై నెట్టివేయడానికి ప్రయత్నించారని తెలిపారు. ఆయా ఘటనల వివరాలను తెలుపుతూ 75 పేజీల అనుబంధ పత్రాలను లేఖకు జతచేశారు.