ప్రకాష్ రాజ్‌పై చర్యలు తీసుకోవాలి

సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై కేంద్ర హోంశాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే ఎం రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ప్రధాని మోదీపై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని గురించి జోకర్ అని అవహేళనగా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడుతూ ట్వీట్ చేశారు.
 
“534 మంది పార్లమెంటు సభ్యులను ‘బంచ్ ఆఫ్ జోకర్లు’ గా సంబోధించడం చాలా బాధాకరం. ఇంతకు ముందు కూడా ఇలా చాలా సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ప్రకాష్ రాజ్‌పై వెంటనే హోంశాఖ చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తు ఎన్నికలలో పోటీ చేయడానికి అనుమతిని నిరాకరించాలి. దేశం, దేశ ప్రధానమంత్రి , సమాజం పట్ల గౌరవం లేని ప్రకాష్ రాజ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.” అని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
 
హైదరాబాద్‌ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం  సెక్యులర్ రైటర్స్ ఫోరమ్ ఆవిర్భావ సదస్సుకు హాజరైన ప్రకాష్ రాజ్ మణిపూర్ అంశంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ పక్క మణిపూర్ వంద రోజులుగా మండిపోతుంటే పార్లమెంట్‌లో ఎంపీలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారని విమర్శించారు. నువ్వా.. నేనా అన్నట్లు రాజకీయం చేశారే తప్ప సమస్య పరిష్కారం గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదని మండిపడ్డారు.

‘జోకర్‎ను నాయకుడిని చేస్తే మనం చూసేది ఇలాంటి సర్కస్ మాత్రమే’ అంటూ ప్రకాష్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మౌనంగా ఉంటే శరీరానికి తగిలిన గాయాలు మానిపోతాయి కానీ.. దేశానికి తగిలిన గాయాలు రాచపుండులా మారుతాయని అన్నారు. ప్రస్తుతం మన దేశం, మనం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నామని పేర్కొన్నారు.

 
 ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బీజేపీ నాయుకులు ఆయనపై మండిపడుతున్నారు. తాజాగా రఘునందన్ రావు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖను డిమాండ్ చేశారు.