రెంజల్ లో రైతుల దీక్షలను భగ్నం చేసిన పోలీసులు

మండల కేంద్రం రెంజల్ లో 46 రోజులుగా కొనసాగుతున్న రైతుల దీక్షలను శనివారం పోలీసులు భగ్నం చేశారు. రెంజల్ నుండి దూపల్లి వైపు వెళ్లే బందల్లా, మాసపురం, శివాలయం నుండి కెనాల్ వరకు వెళ్లే రోడ్డు మార్గాలను బీటీ రోడ్లుగా మార్చాలని డిమాండ్ చేస్తూ రైతులు జూన్ 28న నిరవధిక సమ్మెకు దిగారు. 

2015లో రూ.1.54 కోట్ల నిధులతో స్థానిక ఎమ్మెల్యే షకీల్, ఆనాటి పార్లమెంటు సభ్యురాలు, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఆ పనులు ముందుకు సాగకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడ్డారు. ఎనిమిదేళ్లు గడిచిపోతున్నా ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారడంతో రైతులు అక్రోశానికి గురయ్యారు.

 గ్రామ రైతులు సంఘటితమై నిరవధిక సమ్మె బాట పట్టారు. రోజుకో కుల సంఘం పెద్దలు దీక్షలో కూర్చుంటూ తమ మద్దతు ప్రకటించారు. శుక్రవారం రైతులు, మహిళలతో పెద్ద ఎత్తున మహాధర్నను నిర్వహించి రోడ్లపైనే వంట వార్పు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రూ.3.5 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వాట్సప్ పోస్టింగులు, సోషల్ మీడియా ద్వారా తెలపడం కాదని దీక్షల వద్దకు వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఈ సందర్భంగా రైతు నాయకులు డిమాండ్ చేశారు.

శనివారం ఉదయం రైతుల దీక్షల పక్కనే మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్ల నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే షకిల్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రైతులు, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా ఒకరిపై ఒకరు నినాదాలు చేయడంతో వాతావరణం వేడెక్కింది. 

బీఆర్ఎస్ నాయకులు రైతుల దీక్షల వద్దే టెంటు వేసి బైఠాయించారు. దీంతో ఒకరిపై ఒకరు రెచ్చిపోవడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఇరువురిని సముదాయించినా ససేమిరా అనడంతో ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. 

పోలీసులు రైతుల దీక్షలను భగ్నం చేసి ఐచర్ వ్యాన్ లో రైతులు, రైతు నాయకులను అరెస్టు చేసి తీసుకెళ్లారు. అలాగే బీఆర్ఎస్ నాయకులను మరో వాహనంలో ఎక్కించి స్టేషన్ కు తరలించారు. అనంతరం రైతుల దీక్షల టెంటును పోలీసులు తొలగించారు. సుమారు నాలుగు గంటల పాటు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.