డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం తెలంగాణ బీజేపీ పోరుబాట

 
పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం బీజేపీ పోరుబాట పట్టింది. శనివారం ఇందిరాపార్క్ వద్ద జరిపిన మహాధర్నాలో  రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.  కిషన్‌రెడ్డి  మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇండ్లపై ఉద్యమం చేపడతామని ప్రకటించారు. ఈ నెల 16,17 తేదీల్లో బస్తీల సమస్యలపై “బస్తీల బాట” చేపడతామన, బస్తీ, పేద ప్రజలను కలిసి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 
 
18న డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే 23, 24 తేదీల్లో అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని, వచ్చే నెల 4న డబుల్ బెడ్ రూం ఇండ్ల సమస్యపై హైదరాబాద్‌లో విశ్వరూప ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు.  సీఎం కేసీఆర్ కండ్లు తెరిపించే విధంగా ధర్నా ఉంటుందని చెప్పారు.
ఇండ్లు ఇస్తారా? గద్దె దిగుతారా? అని టీఆర్‌ఎస్ నాయకులను ప్రశ్నించాలని, నిలదీయాలని పార్టీ నేతలకు పిలునిచ్చారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ లోపల, బయట డబుల్ బెడ్రూం ఇళ్ళపై పేదలను మభ్యపెడుతున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు వస్తాయని తెలిపారు.
తొమ్మిదేళ్ళల్లో పేదలకు ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల్లో ప్రగతిభవన్ కట్టుకున్న కేసీఆర్‌కు పేదల ఇళ్ళపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. పేదల గొంతు కోయటం‌ కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రజాకార్ల ప్రభుత్వమని పేర్కొంటూ పేద ప్రజలంతా బీజేపీతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఫామ్ హౌస్‌లో, ప్రగతి భవన్‌లో నిద్ర పోతున్నది కేసీఆర్ ప్రభుత్వమని విరుచుకుపడ్డారు. వరదలొచ్చిన సీఎం కేసీఆర్ బయటకు రారని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.  బలిదానాలతో వచ్చిన తెలంగాణ కేసీఆర్ పాలనలో దగా పడిందని చెబుతూ తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయ్యిందని పేర్కొన్నారు. 
 
తెలంగాణ సంపదను బీఆర్ఎస్ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఏడు లక్షల‌ కోట్ల అప్పులు చేశారని, మాఫియాలు తెలంగాణను పాలిస్తున్నాయని మండిపడ్డారు. 35 లక్షల మందికి డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇస్తామన్న కేసీఆర్ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సొంత జాగ ఉంటే ఇల్లు కట్టుకోవటానికి డబ్బులిస్తామనటం దుర్మార్గమని విమర్శించారు.
రాష్ట్ర సర్కార్ పేదలకు ఇళ్లు కడితే కేంద్రం వాటాను తీసుకొచ్చే బాధ్యత తెలంగాణ బీజేపీ తీసుకుంటోందని తెలిపారు. ఏదేమైనా నాలుగు నెలల తర్వాత కేసీఆర్ గద్దె దిగటం ఖాయమని స్పష్టం చేశారు.  బిఆర్ఎస్ కు పేదల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఇళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని 2017 లో చెప్పిన కెసిఆర్ ఇప్పుడు మరోసారి ఎన్నికలకు ఎలా వెళతారని ప్రశ్నించారు.
సిఎం కెసిఆర్ అబద్దాలకు ప్రతిరూపమని విమర్శించారు. పాత హామీలనే కొత్తగా చెబుతూ మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అడుగడుగునా అన్యాయం రాజ్యమేలుతుందని దుయ్యబట్టారు. అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.