ఏపీ సీఎంవోలో డిజిటల్ సంతకాల కుంభకోణం

ఏపీ సీఎం కార్యాలయంలో డిజిటల్‌ సంతకాల కుంభకోణం సంచలనం రేపింది. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కొందరు కార్యదర్శుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేసిన వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ చురుగ్గా దర్యాప్తు చేస్తోంది. 
దీనికి సంబంధించిన వివరాలను సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడిస్తూ సీఎంవోలో డిజిటల్ సంతకాల మోసం కేసులో ఐదుగురు నిందితుల్ని అరెస్టుచేసినట్లు ప్రకటించారు. 
సీఎంవోలో పనిచేస్తున్న కొందరు కార్యదర్శుల డిజిటల్ సంతకాలను నిందితులు దుర్వినియోగం చేసి వేల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ డిజిటల్ సంతకాల దుర్వినియోగంతో సీఎం పిటిషన్లు జారీ చేసినట్లు సీఐడీ గుర్తించింది. ఇలా చేసిన ఒక్కో ఫైల్ కూ రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేసినట్లు సీఐడీ ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు ఇలా మోసం జరిగినట్లు తెలుస్తోంది.
 
గత కొంతకాలంగా సీఎంవో అధికారుల డిజిటల్ సంతకాలు ఉపయోగించి సీఎం పిటిషన్లు జనరేట్ చేశారు నిందితులు. ఈ విషయంపై సీఎంవో అధికారుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.  సీఎంవోలోని రేవు ముత్యాల రాజు, ధనుంజయ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి పేషీల్లో పనిచేస్తున్న కొందరు డిజిటల్ సంతకాలు దుర్వినియోగం చేశారు. 
ఈ కేసులో కనమర్ల శ్రీను, గుత్తుల సీత రామయ్య, నలజల సాయి రామ్, భూక్యా చైతన్య నాయక్, అబ్దుల్ రజాక్ అరెస్టు చేసినట్లు సీఐడీ ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఏప్రిల్ నుంచి 3 నెలలలో 66 సీఎం పిటిషన్లు జారీ చేసిన నిందితులు.. మొత్తం రూ.15లక్షల వరకూ వసూలు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. 
 
అయితే ఏ దస్త్రానికి తుది ఆమోదం రాలేదని, ఈ వ్యవహారంపై తదుపరి విచారణ చేస్తున్నామన్నారు. ఇలా జారీ అయిన పిటిషన్ల స్టేటస్ చెక్ చేసే సమయంలో మోసం బయటపడినట్లు తెలుస్తోంది. దీంతో సీఐడీ మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా సీఎంవోలో ఉన్న కార్యదర్శుల ఈ-ఆఫీస్ లాగిన్ యూసర్ నేమ్, పాస్ వర్డ్ లను వినియోగించి ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థనలను సీఎంవో కార్యదర్శులకు తెలియకుండా సీఎం పిటిషన్లు తయారీ చేస్తున్నారు.
ఈ-ఆఫీస్ ద్వారా కార్యదర్శుల డిజిటల్ సంతకాలను ఉపయోగించి సీఎం పిటిషన్లను సంబంధిత శాఖలకు పంపిస్తున్నారు.  ఈ కేసులో ప్రథమ ముద్దాయి అయిన కనమర్ల శ్రీను ఈ- ఆఫీస్ లోని అనుభవంతో వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కోసం సీఎం పిటిషన్లను ఏ శాఖకు కావాలంటే ఆ శాఖ సెక్రెటరీ టు సీఎం సంతకాలను కాపీ, పెస్ట్ చేసి పంపించేవాడు.
అలాగే ఈ-ఆఫీస్ లో ప్రాసెసింగ్ కోసం వీరంతా కలిసి ఒక ప్లాన్ ప్రకారం అభ్యర్థుల నుంచి అర్జీలు తీసుకోవడం, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థన లేఖలను సేకరించడం వాటిని ఈ-ఆఫీస్ లో అప్లోడ్ చేసేవాళ్లు. ఇలా చేసేందుకు డబ్బులు తీసుకుని వీళ్లంతా పంచుకోవడం చేశారు.