ప్రియాంక గాంధీ, కమల్ నాథ్ లపై బీజేపీ పోలీస్ ఫిర్యాదు

* ఎంపీలో `50 శాతం కమీషన్ల బిజెపి ప్రభుత్వం’ అంటూ నకిలీ లేఖ
 
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై `30 శాతం కమిషన్’ ప్రభుత్వం అంటూ అవినీతి ఆరోపణలు చేసి కొంత మేరకు లబ్ది పొందిన కాంగ్రెస్ ఇప్పుడు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్య ప్రదేశ్ లో సహితం అటువంటి దుష్ప్రచారంకు తెరతీసింది. అక్కడున్న బీజేపీ నేత  శివరాజ్ సింగ్ చౌహన్ నేతృత్వంలోని ప్రభుత్వం `50 శాతం కమీషన్ల’ ప్రభుత్వం అంటూ ఓ నకిలీ లేఖను సృష్టించి కాంగ్రెస్ పెద్ద ఎత్తున చేపట్టిన ప్రచారం ఇప్పుడు ఎదురు తిరగడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకొంది.
 
మధ్యప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం 50 శాతం కాంట్రాక్టర్ల కమిషన్ల ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తదితరులు చేస్తున్న ఆరోపణలపై  బిజెపి భగ్గుమంది. కాంట్రాక్టర్ల నుండి బిల్లుల చెల్లింపుకు 50 శాతం కమీషన్లు తీసుకొంటున్నట్లు `నకిలీ లేఖలు’ సృష్టించారంటూ ప్రియాంక గాంధీ, కమల్ నాథ్, ఇతర కాంగ్రెస్ నేతలపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
 
మంత్రి విశ్వాస్ సారంగ్ నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం భోపాల్‌లోని క్రైం బ్రాంచ్ కార్యాలయానికి వెళ్లి కాంగ్రెస్ నేతలపై ఎఫ్ఐఆర్ కోరుతూ ఫిర్యాదు సమర్పించింది. ఇండోర్‌లో, నగర బిజెపి అధ్యక్షుడు గౌరవ్ రాండివ్ ఇదే విధమైన ప్రతినిధి బృందానికి సంయోంగితగంజ్ పోలీస్ స్టేషన్‌కు నాయకత్వం వహించారు. కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు చేయాలని కోరుతూ ఆర్థిక నేరాల విభాగంకు ఫిర్యాదు చేశారు.
 
భోపాల్‌లో సారంగ్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ ‘ముహబ్బత్ కి దుకాన్’ (ప్రేమ దుకాణం)కి బదులుగా అబద్ధాలు, ద్వేషాల దుకాణాన్ని తెరిచింది. సోషల్ మీడియాలో నకిలీ లేఖను షేర్ చేసిన ప్రియాంక వాద్రా, కమల్ నాథ్,  కాంగ్రెస్ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు, క్రైమ్ బ్రాంచ్‌కి మెమోరాండం సమర్పించామని తెలిపారు.
 
‘చిన్న కాంట్రాక్టర్ల నుండి 50 శాతం కమీషన్ వసూలు చేయడం’ ద్వారా భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ, బిజెపి ప్రభుత్వంపై కాంగ్రెస్ శుక్రవారం రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున దాడిని ప్రారంభించింది.  గ్వాలియర్‌కు చెందిన చిన్నకాంట్రాక్టర్ల సంఘం  రాష్త్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్రాసినట్లు చెబుతున్నఓ `లేఖ’ ఆధారంగా ప్రియాంక గాంధీ వాద్రా, జాతీయ స్థాయిలో కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్‌లు మధ్యప్రదేశ్‌లో ఈ ఆరోపణలు చేశారు.
 
అయితే అదే రోజు బీజేపీ ఆ లేఖ నకిలీదని స్పష్టం చేసింది. ఈ లేఖను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అరుణ్ యాదవ్ గురువారం ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో మొదట పంచుకున్నారు. కానీ ప్రియాంక గాంధీ, కమల్  నాథ్, జైరాం రమేష్ సోషల్ మీడియాలో ఆ లేఖ ప్రతిని  ఉపయోగించలేదు.  యాదవ్ ఆరోపణలపై ఆధారపడిన వార్తాపత్రిక కటింగ్‌లను ఉపయోగించి 50 శాతం కమిషన్ ఆరోపణలను ట్వీట్ చేశారు.
 
కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్న లేఖ గురించి రాష్ట్ర నిఘా విభాగం విచారణ జరిపిందని, కానీ దాన్ని ఎవరు వ్రాసారో, అందులో చిరునామా ఎక్కడ ఉందొ వెల్లడి కావడం లేదని  ముఖ్యమంత్రి చౌహన్ వెల్లడించారు.  అటువంటి సంఘం గాని, అటువంటి చిరునామా కానీ లేవని అంటూ కాంగ్రెస్ నకిలీ ప్రచారానికి శ్రీకారం చుట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. “మాతో సానుకూల అంశాలు, అభివృద్ధి అంశాలపై పోటీ పడలేక ప్రమాదకరమైన అంశాలను ఆశ్రయిస్తుంది” అంటూ కాంగ్రెస్ పై మండిపడ్డారు.
 
ప్రియాంక గాంధీకి అసత్యాలు వల్లించడం పరిపాటి అయిందని, ఇటువంటి అవాకులు చెవాకులు దిగితే తగు విధంగా చర్యలు ఉంటాయని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, ఆరోపణలు చేసే ముందు వీటికి బలం చేకూర్చే సాక్షాధారాలు చూపెట్టాలని మంత్రి సవాల్ విసిరారు. 
 
ఆమె తన వాదనను నిరూపించుకో లేకపోతే బిజెపి ప్రభుత్వం, పార్టీ వర్గాలు తగు విధంగా స్పందిస్తాయని స్పష్టం చేశారు. ఆమె మాటలను ఉపసంహరించుకోవాలి, లేదా నిరూపించాల్సి ఉంటుందని చెబుతూ లేని పక్షంలో తాము చేసేది తాము చేసి చూపుతామని హెచ్చరించారు.