సినీ నటి జయప్రదకు ఆర్నెళ్ల జైలు శిక్ష

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఆరు నెలల జైలు శిక్షను విధిస్తూ చెన్నై ఎగ్మోర్‌ కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. ఆమెతో పాటు మరో ముగ్గురికి కూడా ఈ శిక్షను విధించింది. శిక్షణతోపాటు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున కోర్టు జరిమానా విధించింది. 
 
ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే చెన్నైకి చెందిన రామ్‌కుమార్‌, రాజబాబుతో కలిసి నటి జయప్రద గతంలో చెన్నైలోని రాయపేటలో ఓ సినిమా థియేటర్‌ని నిర్వహించేవారు. మొదట్లో ఈ థియేటర్‌ వల్ల లాభాలొచ్చాయి. ఆ సమయంలో థియేటర్‌లో పనిచేసే కార్మికుల నుంచి ఇఎస్‌ఐ కోసమని కొంత డబ్బులు వసూలు చేశారు. 
 
కానీ ఆ తర్వాత రాబడి తగ్గడంతో ఆ థియేటర్‌ని మూసేశారు. ఆ సమయంలో కార్మికుల నుంచి ఇఎస్‌ఐ కోసం తీసుకున్న డబ్బుల్ని తిరిగి కార్మికులకు అందజేయలేదు. దీంతో కార్మికులందరూ ఆ డబ్బు కోసం బీమా కార్పొరేషన్‌ను ఆశ్రయించారు. ఆ బీమా సంస్థ చెన్నై ఎగ్మోర్‌ కోర్టును ఆశ్రయించి, థియేటర్‌ యాజమాన్యానికి వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలు చేసింది. థియేటర్‌ యాజమాన్యం కార్మికుల నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి వారికి చెల్లించలేదని బీమా సంస్థ కోర్టులో పేర్కొంది. 
 
అయితే బీమా సంస్థ పిటిషన్‌ని వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో జయప్రద తదితరులు దాఖలు చేసిన మూడు పిటిషన్లు కొట్టివేసింది. కార్మికుల నుంచి వసూలు చేసిన డబ్బుల్ని తిరిగా కార్మికులకి అందిస్తామని జయప్రద న్యాయస్థానానికి చెప్పినా. కోర్టు అంగీకరించలేదు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న ఎగ్మోర్‌ న్యాయస్థానం జయప్రదతోపాటు, మరో ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
 
కొన్నేళ్ల కిందట థియేటర్‌ కాంప్లెక్స్‌కు సంబంధించి రూ. 20 లక్షల ఆదాయపు పన్ను బకాయి పడటంతో సిటీ సివిల్ కోర్టు ఆదేశాల మేరకు థియేటర్‌లోని కుర్చీలు, ప్రొజెక్టర్, ఫిల్మ్ రోల్స్‌ను కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విధుల్లో ఉన్న ఉద్యోగులు తక్షణ వాయిదా కింద రూ.5 లక్షలు ఇవ్వగా, మొత్తం డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)గా చెల్లించాలని డిమాండ్ చేశారు.