ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం నిర్ణయం

కొండెక్కిన ట‌మాట ధ‌ర‌లు క్రమంగా తగ్గుతుంటే ఇప్పుడిప్పులే ఉల్లి ధ‌ర‌లూ ఘాటెక్కుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా ఉల్లి ధ‌ర‌లు కొండెక్క‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ధ‌ర‌ల‌ను కిందికి దింపేందుకు త‌న వ‌ద్ద ఉన్న మిగులు నిల్వ‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసేందుకు కేంద్రం సంసిద్ధ‌మైంది. 

2023-24లో మిగులు నిల్వ కింద మూడు ల‌క్ష‌ల ట‌న్నుల ఉల్లిని నిల్వ చేస్తామ‌ని గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.  2022-23లో సీజ‌న్‌లో కేంద్రం 2.51 ల‌క్ష‌ల ట‌న్నుల ఉల్లిని మిగులు నిల్వ‌ల కింద నిర్వ‌హించింది. స‌ర‌ఫ‌రాలు త‌గ్గి ధ‌ర‌లు అమాంతం ఎగ‌బాకితే ధ‌ర‌ల స్ధిరీక‌ర‌ణ కోసం ప్ర‌భుత్వం మిగులు నిల్వ‌ల‌ను సిద్ధం చేస్తుంది. 

నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్ స‌హా ప‌లు వ్య‌వ‌సాయ మార్కెటింగ్ సంస్ధ‌ల ఎండీల‌తో ఆహార పౌర‌స‌ర‌ఫ‌రాల కార్య‌ద‌ర్శి రోహిత్ కుమార్ సింగ్ భేటీ సంద‌ర్భంగా మిగులు నిల్వ‌ల నుంచి ఉల్లిని మార్కెట్‌లోకి విడుద‌ల చేసే వివ‌రాల‌ను తెలిపారు. ఉల్లి నిల్వ‌ల విడుద‌లపై విధివిధానాల‌ను ఖ‌రారు చేశారు. 

దేశ‌వ్యాప్త స‌గ‌టు కంటే ఉల్లి రిటైల్ ధ‌ర‌లు అధికంగా ఉన్న ప్రాంతాలు, కీల‌క మార్కెట్లు ల‌క్ష్యంగా ఉల్లి నిల్వ‌ల‌ను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని ఆహార మంత్రిత్వ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ-వేలం, ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫాంల‌పై రిటైల్ సేల్స్ ద్వారా మిగులు నిల్వ‌ల‌ను విడుద‌ల చేయ‌డంపైనా క‌స‌ర‌త్తు సాగిస్తున్నామ‌ని పేర్కొంది.

నిత్యావసరాల్లో అత్యంత ముఖ్యమైన ఉల్లి ధరలు మార్కెట్‌లో తరచుగా హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ముఖ్యంగా రైతులు సరకు మార్కెట్‌కు తీసుకు వచ్చే సమయంలో ధరలు అమాంతం తగ్గిపోతుంటాయి. సరఫరాలను నియంత్రిస్తూ వ్యాపారులు వాటి ధరలను ఇష్టానుసారం పెంచుతుంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఉల్లి భారీగా మార్కెట్లోకి వచ్చే సమయంలో ప్రభుత్వం భారీగా సేకరించి, గోదాముల్లో భద్రపరుస్తోంది.