యథాతథంగా కీలక వడ్డీ రేట్లు

బ్యాంక్ ఈఎంఐలపై వడ్డీ రేట్లు పెరగడం లేదు. ఆర్థికవేత్తలు అంచనా వేసినట్లుగానే కీలకమైన రెపో రేటును 6.50 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయించిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు. ఆరుగురు సభ్యుల ఎంపీసీ కీలక రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించడం ఇది మూడోసారి.

‘సంబంధిత అన్ని అంశాలపై వివరణాత్మక చర్చల తర్వాత, ఎంపీసీ పాలసీ రెపో రేటును 6.50 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది’ అని దాస్ తెలిపారు. పర్యవసానంగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) రేటు 6.25 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు, బ్యాంక్ రేటు 6.75 శాతం వద్ద ఉన్నాయి.

వృద్ధికి ఊతమిస్తూనే ద్రవ్యోల్బణం కట్టు తప్పకుండా పరిమితికి లోబడి ఉండేలా అవసరమైతే సర్దుబాటు వైఖరిని ఉపసంహరించుకునేందుకు ఆరుగురులోని 5 మంది సభ్యుల సమ్మతితో ఎంపీసీ నిర్ణయించిందని ఆయన  తెలియజేశారు.

అయితే, గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం గణనీయంగా పెరగడం పట్ల గవర్నర్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఆర్బీఐ రెపో రేటును యాథాతథంగా కొనసాగించడానికి ప్రేరేపించిందని తెలిపారు. కాగా, రెపో రేట్లలో మార్పు లేకపోవడం వల్ల బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉండబోదు. దాని వల్ల ఈఎంఐలు చెల్లించే వారికి భారం ఉండదు.

ఒకపక్క అగ్రరాజ్యం అమెరికా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రేట్ల పెంపును కొనసాగిస్తూ ముందుకుపోతున్న తరుణంలో భారత సెంట్రల్ బ్యాంక్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించి దేశీయ ప్రజలకు ఊరటను ప్రకటించింది.  దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాల వర్షపాతం తక్కువగా ఉండటం, కొన్ని చోట్ల అధికంగా కురిసిన వానలతో వరదలు కారణంగా ఆహార ధాన్యాల ధరలను పెంచాయని గవర్నర్ వెల్లడించారు.

దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో మూడు నెలల గరిష్ఠ స్థాయి 4.81 శాతానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సహేతుకమైన వేగంతో వృద్ధి చెందుతూ.. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రపంచ అభివృద్ధికి దేశ ఆర్థిక వ్యవస్థ సహకారం దాదాపు 15 శాతంగా ఉందని శక్తికాంత దాస్ తెలిపారు. 

ఏప్రిల్ సమావేశానికి ముందు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి మే 2022 నుంచి దశలవారీగా మొత్తం 250 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును రిజర్వు బ్యాంక్ పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 6 సార్లు రేట్ల పెంపును ప్రకటించిన ఆర్బీఐ ద్రవ్యోల్బణంపై ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలో రెపో రేటు 4 శాతం నుంచి 6.5 శాతానికి చేరుకుంది.