లోక్ సభలో వీగిన విపక్షాల అవిశ్వాస తీర్మానం

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్ సభలో గురువారం సాయంత్రం వీగిపోయింది. మూజువాణి ఓటింగ్ తో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. అయితే ఓటింగ్ కు ముందే విపక్షాల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. 
 
కాగా ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని ముందే తెలిసిన కూడా విపక్ష కూటమి ప్రధాని మోదీతో సమాధానం చెప్పించాలని చూశారు.  ఈ క్రమంలో లోక్ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. 2018 తర్వాత 2023లో అవిశ్వాసం పెట్టారు. 2028లోనూ మాపై ప్రతిపక్షాలు అవిశ్వాసం పెడతాయని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు.

అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారో అర్ధం కావడం లేదని, పెట్టేదైనా సరిగా పెట్టొచ్చు కదా అని ప్రతిపక్షాలనుద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు. మరోసారి అవిశ్వాసం పెట్టినప్పుడైనా సంసిద్ధతతో వస్తారని ఆశిస్తున్నా అంటూ ధ్వజమెత్తారు. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో ప్రధాని మోదీ విపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

భారత్ లో తయారైన కరోనా వ్యాక్సిన్ పై విపక్షాలకు నమ్మకం లేకుండా పోయిందని, మేకిన్ ఇండియా అంటే ఎగతాళి చేశారన్నారని చెబుతూ పాక్ చెప్పిందే విపక్షాలు నమ్ముతున్నాయని మండిపడ్డారు.పాక్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేశామని పేర్కొంటూ విపక్షాలకు పాకిస్థాన్ పై ప్రేమ కనిపిస్తుందని ప్రధాని చురకలు అంటించారు.

కాగా లోక్ సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్ ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై ఈ తీర్మానంపై 3 రోజుల పాటు సభలో చర్చ జరిగింది. ఈ క్రమంలో చివరి రోజు ప్రధాని మోదీ అవిశ్వాస తీర్మానంపై మాట్లాడారు. ఆ తర్వాత మూజువాణి ఓటింగ్ తో అవిశ్వాసం వీగిపోయిందని స్పీకర్ తెలిపారు. ప్రధాని మోదీ మాట్లాడుతుండగా విపక్ష కూటమి సభ్యులు వాకౌట్ చేశారు. దీనితో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేకి మెజారిటీ ఉండడంతో విపక్షాల అవిశ్వాసం వీగిపోయింది. కాగా ఎన్డీయే అధికారంలోకి వచ్చాక అవిశ్వాసాన్ని ఎదుర్కోవడం ఇది రెండోసారి.

త్వరలో ప్రగతిపథంలో మణిపూర్

హైకోర్టు తీర్పు తర్వాత మణిపూర్ లో పరిస్థితి మారిందని, దీనిపై విపక్షాలకు చర్చ అవసరం లేదని మండిపడ్డారు. హైకోర్టు తీర్పులో రెండు కోణాలున్నాయన్న ప్రధాని మోదీ మణిపూర్ త్వరలో ప్రగతిపథంలో నడుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మణిపూర్ లో ప్రజాస్వామ్యం హత్య జరిగిందంటున్నారు. వాళ్ల మనసులో ఏదుంటే అదే కనిపిస్తుందని ధ్వజమెత్తారు. 

మణిపూర్ పై అర్ధవంతమైన చర్చ జరిపే ఉద్దేశ్యం ప్రతిపక్షాలకు లేదని ప్రధాని విమర్శించారు. తాము చర్చకు ఆహ్వానించామని కానీ విపక్షాలు రావడం లేదని చెప్పారు. భారతమాతను ముక్కలు చేసింది వీళ్లేనన్న ప్రధాని వందేమాతరం గీతాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసింది వీళ్లేనని ఆరోపించారు. భారతమాత చావును ఎందుకు కోరుకుంటున్నారో అర్ధం కావడం లేదంటూ  భారతమాతను కాపాడాల్సిన వాళ్లే భుజాలు నరికేశారని, తుక్ డే గ్యాంగ్ ను ప్రోత్సాహిస్తున్నారని ధ్వజమెత్తారు. 1966 మిజోరాం  ఘటనకు కారణం ఎవరని ప్రధాని ఈ సందర్బంగా ప్రశ్నించారు. 

ఆనాడు సామాన్యులపై దాడులు చేయించారని, మిజోరాం ప్రజలపై బాంబులు వేయించేందుకు ఎయిర్ ఫోర్స్ ను ఉపయోగించారని గుర్తు చేశారు. మిజోరాం గాయాన్ని మాన్పించేందుకు కాంగ్రెస్  ప్రయత్నించలేదని విమర్శించారు. నెహ్రూపై లోహియా తీవ్ర ఆరోపణలు చేశారని చెబుతూ ఈశాన్య భారతాన్ని చీకట్లో ఉంచేశారని లోహియా చెప్పారని పేర్కొన్నారు. 

ఈశాన్య రాష్ట్రాల గురించి మీరా మాకు చెప్పేదని అంటూ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో 50 సార్లు పర్యటించామని చెబుతూ తమ హయాంలోనే ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి జరిగిందని, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ లో అభివృద్ధిని కాంగ్రెస్ చూడలేకపోతుందని ప్రధాని మండిపడ్డారు. మణిపూర్ అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం ఎంతో చేసిందని చెబుతూ మణిపూర్ లో సాయంత్రం 4 గంటలకు మసీదులు, గుళ్లు మూసేసేవారని గుర్తు చేశారు. ఈ పాపం కాంగ్రెస్ ది కాదా? అని ప్రధాని మోదీ ప్రశ్నించారు.