కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్‌పై సస్పెన్షన్‌ వేటు

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డ కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత అధిర్‌ రంజన్‌ చౌధురిపై గురువారం సస్పెన్షన్‌ వేటు పడింది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ప్రొసీడింగ్స్‌ను అడ్డుకున్నారంటూ సభ నుంచి సస్పెండ్‌ చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. ఈ అంశంపై ప్రివిలేజెస్‌ కమిటీ తన నివేదిక సమర్పించేవరకు ఆయనపై సస్పెన్షన్‌ కొనసాగనుంది.

మోదీ ప్రసంగానికి ముందు అవిశ్వాస తీర్మానంపై అధికార పార్టీ సభ్యులు మాట్లాడే సమయంలో అధిర్ రంజన్ చౌదరి పదేపదే అడ్డుపడటం కనిపించింది. అధికార పార్టీ సభ్యులు దూకుడు ప్రదర్శించడం, కఠిన పదాలను వాడిన ప్రతీసారీ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి ప్రసంగానికి అడ్డు తగిలారు. సభ కార్యకలాపాలకు అధిర్ రంజన్ ప్రతీసారీ అంతరాయం కలిగించారని, ఉద్దేశపూర్వకంగా అడ్డుపడ్డారని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. 
 
ఇలా అడ్డుపడటం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. తాము పలుమార్లు హెచ్చరించినప్పటికీ తన ప్రవర్తనను మార్చుకోలేదని, చర్చల్లో పాల్గొన్న ప్రతీసారీ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్నప్పుడు కూడా అధిర్ రంజన్ ఇలాగే ప్రవర్తించారని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ప్రివిలేజ్ కమిటీకి నివేదిక అందేంత వరకూ ఆయన సస్పెన్షన్‌లో ఉంటారని చెప్పారు.

దీనిపై అధిర్‌ మాట్లాడుతూ.. ‘‘నేనేవర్ని కించపర్చలేదు. నేనేమీ తప్పుగా మాట్లాడలేదు’’ అని తెలిపారు. అంతకుముందు అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా అధిర్‌ బీజేపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. వారసత్వ, అవినీతి రాజకీయాలను నిర్మూలించేందుకు ‘క్విట్‌ ఇండియా’ రావాల్సిందేనంటూ బీజేపీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. 

విభజన రాజకీయాలు, మత విద్వేషాలు, కాషాయీకరణను దేశం నుంచి తరిమికొట్టేందుకు ‘క్విట్‌ ఇండియా’ రావాల్సిందేనని తెలిపారు. ‘‘మణిపూర్‌ ప్రజలకు ప్రధాని శాంతి సందేశం ఇవ్వాలి. మన్‌కీ బాత్‌లోనైనా ఆయన స్పందించాలి. అమెరికా, యూరోపియన్‌ పార్లమెంట్‌లో కూడా మణిపూర్‌ అంశంపై చర్చించారు. మణిపూర్‌ అల్లర్లు చిన్న విషయం కాదు. అందుకే ప్రధాని స్పందించాలని డిమాండ్‌ చేశాం” అని చెప్పారు. 

అవిశ్వాస తీర్మానానికి ఉన్న శక్తే ఆయన్ను పార్లమెంట్‌కు రప్పిస్తోందని అంటూ ఒకప్పుడు నిండుసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే అంధుడైన ధృతరాష్ర్టుడు ఎలాగైతే నిస్సహాయంగా ఉన్నాడో ఇప్పుడు మణిపూర్‌ విషయంలోనూ మోదీ అలాగే ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. 

మరోవైపు అధిర్‌ వ్యాఖ్యలపై బీజేపీ అగ్గిమీద గుగ్గిలమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పలువురు బీజేపీ ఎంపీలు సభలో నిరసన తెలిపారు. అధిర్‌ క్షమాపణలు చెప్పాలని, ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ ఓంబిర్లా స్పందిస్తూ అధిర్‌ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.